Hyderabad | హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలకుతోడు మూడో నగరంగా సైబరాబాద్.. ఆధునిక ఐటీ హబ్‌గా అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. ఇప్పుడు నాలుగో నగరంగా శంషాబాద్ అభివృద్ధి ప్రస్థానం మొదలైంది. దక్షిణాన అంతర్జాతీయ విమానాశ్రయంతో మొదలై.. జాతీయ, అంతర్జాతీయస్థాయి కంపెనీలు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, హర్డ్‌వేర్, తయారీ, లాజిస్టిక్ వంటి కీలక రంగాలకు కేంద్రంగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం పట్టణీకరణకు ప్రాధాన్యతనిస్తూ శివారు ప్రాంతాల్లో అత్యంత మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తోంది. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఫలితంగా నగర శివారులో మరో కొత్త నగరంగా శంషాబాద్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అభివృద్ధిలో ఇప్పుడు శంషాబాద్ హాట్ ఫేవరేట్‌గా తయారైంది. కార్పొరేట్ల చూపు ఇక్కడ పడుతుండటంతో కీలక రంగాల విస్తరణ ఊపందుకుంటున్నది. ఇప్పటికే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఎన్నో ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. ప్రయాణికుల రవాణాలోనేగాక సరుకు రవాణా (కార్గో)లో దక్షిణ భారతంలో అత్యంత కీలకమైన విమానాశ్రయంగా పేరు గడించింది. దీనికితోడు సుమారు 5వేల ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు విమానాశ్రయంలోనే సరికొత్తగా ఏరోసిటీ నిర్మాణం ప్రారంభమైంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలు సరుకు రవాణాపరంగా భారీ కేంద్రాలను ఏరోసిటీలో ఏర్పాటు చేయగా, వేలాది మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. విద్య, వైద్య, ఆతిథ్య, క్రీడలు, వినోదం వంటి రంగాలకు సంబంధించిన కార్యకలాపాలు ఏరోసిటీలో రాబోతున్నాయి.
సైబరాబాద్ మాదాపూర్ నుంచి మొదలై పడమరవైపు కోకాపేట, తెల్లాపూర్, కొల్లూరు వరకు సుమారు 21 కి.మీ విస్తరించింది. మొత్తంగా ఐటీ కారిడార్‌లో వేల సంఖ్యలో ఐటీ కంపెనీలు, అదే స్థాయిలో ఐటీ ఉద్యోగుల నివాసాల కోసం గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్ అపార్టుమెంట్లు, విల్లా ప్రాజెక్టులతో ఈ ప్రాంతం ఆధునిక నగరంగా మారింది. అలాంటి నగరాన్ని కొత్తగా నాలుగో నగరంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్‌కు ఔటర్ రింగు రోడ్డు అధునాతన వారధిగా మారింది.
రోడ్డు, రైలు, మెట్రో రైలుతోపాటు ఎయిర్‌వేస్‌లు శంషాబాద్ కేంద్రంగా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి ఒకటైతే, అక్కడి నుంచే మొదలయ్యే గ్రేటర్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు మరో మణిహారం. ఇక దక్షిణాది రాష్ర్టాలను కలిపే ప్రధాన రైలు మార్గాల్లో ఒకటిగా సికింద్రాబాద్, కాచిగూడల నుంచి బెంగళూరువైపున్న రైలు మార్గం శంషాబాద్ మీదుగానే ఉంది. తాజాగా ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు లోపలి వరకు నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని 31 కి.మీ పొడవుతో ఔటర్ రింగు రోడ్డు వెంబడి ఆకాశ మార్గం (ఎలివేటెడ్)లో నిర్మిస్తున్నారు.
ఉద్యోగులు ఒకచోట నుంచి మరోచోటుకు వెళ్లాలంటే ఎంతో విలువైన సమయం వృథా అవుతున్నది. ఇక కాలుష్యం, ఆరోగ్య సమస్యలూ ఉంటున్నాయి. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ ప్రభుత్వం వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌తో పరిశ్రమల ఏర్పాటుతోపాటు అక్కడే నివాసం ఉండేందుకు టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఓఆర్ఆర్పై ఉన్న 19 ఇంటర్‌చేంజ్‌ల వద్ద టౌన్‌షిప్‌లను నిర్మించడంతోపాటు దానికి సమీపంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.