Sagar Society | బంజారాహిల్స్, డిసెంబర్ 12: 45 రోజుల క్రితం ఖరీదైన స్థలాన్ని ఆక్రమించారంటూ షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆగమేఘాల మీద అక్కడకు చేరుకుని సుమారు రెండు వేల గజాల స్థలం చుట్టూ ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన బ్లూ షీట్లను కూల్చేసి ప్రభుత్వ స్థలం అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కట్ చేస్తే రెండ్రోజుల క్రితం సదరు స్థలం చుట్టూ కూల్చేసిన బ్లూ షీట్లను తొలగించి దర్జాగా కొత్త బ్లూ షీట్లను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, రెండ్రోజులు గడిచినా షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.., షేక్‌పేట మండలం సర్వే నం. 403లోని టీఎస్-1లో బంజారాహిల్స్ రోడ్ నం.2లోని పార్క్ హయత్ హోటల్ పక్కనున్న సుమారు 5.16 ఎకరాల స్థలం విషయంలో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జి.వివేక్, జి.వినోద్ కుటుంబ సభ్యుల మధ్యన న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్నాయి.
రెవెన్యూ రికార్డ్డుల ప్రకారం, టీఎస్-1లోని 5.16 ఎకరాల స్థలం మొత్తం ప్రభుత్వానిదే అని రెవెన్యూ శాఖ వాదిస్తుండగా, ఈ స్థలాన్ని తాము ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేశామని ఎమ్మెల్యే వినోద్ కుటుంబం వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై టైటిల్ కోసం సిటీ సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ యధాలాపంగా కొనసాగించాలని కోర్టులో ఆదేశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఈ స్థలాన్ని ఆనుకుని కింది భాగంలో సాగర్ సొసైటీని ఆనుకుని ఉన్న ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి, కోర్టులో ఉన్న 5.16 ఎకరాల వివాదాస్పద స్థలానికి మధ్యన ఉన్న సుమారు రెండు వేల గజాల స్థలంలో అక్టోబర్ 30న కొంతమంది వ్యక్తులు బ్లూ షీట్లను ఏర్పాటు చేయగా, అక్కడకు చేరుకున్న సికింద్రాబాద్ ఆర్డీవోతో పాటు స్థానిక తహసీల్దార్ అనితారెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ స్థలం ప్రభుత్వానిదంటూ.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే, తాజాగా మరోసారి స్థలం చుట్టూ బ్లూ షీట్లు ఏర్పాటు చేశారని స్థానికులు ఫిర్యాదులు చేసినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వ బోర్డులు పెట్టారు..? ఇప్పుడు ఎవరి ప్రోత్సాహంతో మరోసారి బ్లూ షీట్లు వేశారన్న అనుమానాలు అనేకం వ్యక్తం అవుతున్నాయి.