సిటీబ్యూరో/చార్మినార్,జూన్15, (నమస్తే తెలంగాణ): అమాయక ప్రజలే లక్ష్యంగా గ్రేటర్లో నకిలీ వైద్యులు చలామణి అవుతున్నారు. అర్హత లేకున్నా వైద్య శస్త్ర చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణం పోయిన తరువాత తమకేం సంబంధంలేదని బోర్డులు తిప్పుకుంటున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ వైద్యులపై మెడికల్ కౌన్సిల్ చర్యలు తూతూ మంత్రంగా సాగుతుండటం గమనార్హం.
చార్మినార్ ప్రాంతంలోని షహీన్ ఆసుపత్రి నిర్వహణ అనుమతి కోసం ఓ వైద్యురాలు తన ధ్రువపత్రాలను ఆ ఆసుపత్రి యాజమాన్యానికి అమ్ముకుంది. తాను వేరే చోట వైద్యం చేసుకుంటుండగా తన పేరుతో ఉన్న ఆ ఆసుపత్రిలో షాహీన్ బేగం, భాషా కలిసి వైద్యం చేస్తున్నారు. బ్యాచ్‌లర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ(బీయూఎంఎస్)కోర్సు చేసిన వీళ్లు అర్హత లేకున్నా వైద్యం చేస్తుండటం గమనార్హం. సర్జరీలు, అబార్షన్లు, ప్రసవాలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
శస్త్ర చికిత్సల సమయంలో వైద్యం వికటించి రోగి మరణిస్తే రోగి బంధువులతో కలిసి ఆ విషయం బయటికి తెలియకుండా బేరసారాలకు దిగుతున్నారు. ఆసుపత్రిపై దాడి చేయకుండా రక్షణ కోసం ప్రైవేట్ మనుషులను పెట్టుకుని అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో కర్నూల్‌కు చెందిన ఓ వివాహిత పురిటి నొప్పులతో షహీన్ దవాఖానలో చేరింది. ఆమెకు ఐదు రోజులు వైద్యమందించి సిజేరియన్ చేశారు. చికిత్స వికటించి ఆమె మృతిచెందింది. ఈ సంఘటన బయటికి రాకుండా ఆసుపత్రి వైద్యులు జాగ్రత్త పడ్డారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామంటూ ఒప్పించారు.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు పదివేల ప్రైవేట్ ఆసుపత్రులు రిజిస్టర్ కాగా, వాటిలో 70శాతం ఆసుపత్రుల్లో తమ పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్న వైద్యులు కాకుండా ఇతరులు వైద్యం చేయడం గమనార్హం. ఇలా సంవత్సరాల తరబడి అర్హత లేని వ్యక్తులతో వైద్యం చేయిస్తూ, అసలైన వైద్యులు బడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు.
అసలు ఒక వ్యక్తి వైద్యం అందించాలంటే ముందుగా అతను జాతీయ మెడికల్ కౌన్సిల్ గుర్తించిన మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. అప్పుడే అతడు వైద్యం చేసేందుకు అర్హుడు. దానితో పాటు ఆసుపత్రి నడపాలంటే జిల్లా వైద్యాధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. క్లినిక్, ఆసుపత్రిల లైసెన్స్ విషయంలో జిల్లా వైద్యాధికారిదే నిర్ణయం. ఈ తరహా అనుమతులు ఇచ్చి ఇటు జిల్లా వైద్యశాఖ, మరోవైపు మెడికల్ కౌన్సిల్ తనిఖీలు చేయకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆడిందే ఆట పాడిందే పాట తీరుగా సాగుతుంది.