సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు వైద్య సేవలందించాల్సిన ఈఎస్ఐ వైద్యంలో నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. వైద్యం చేయించుకునేందుకు వచ్చినవారికి ఒకవైపు వైద్యులు లేకపోవడం మరోవైపు కావాల్సిన మందులు దొరక్కపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పేరుకు మాత్రమే కార్మిక బీమా ఉన్నదని, కార్మికులకు వైద్యంలో ధీమా ఎక్కడున్నదని వాపోతున్నారు.
తూతూ మంత్రంగా సేవలు..
గ్రేటర్ పరిధిలో సుమారు 10 లక్షల మంది ఈఎస్ఐ కార్డులు కలిగి ఉన్నారు. ఖైరతాబాద్, బాలానగర్, సనత్‌నగర్. చప్పల్‌బజార్, చిక్కడపల్లి, చిలకలగూడ, డబీర్‌పురా, ఫతేనగర్, గోల్కొండ, గోషామహల్, హిమ్మత్‌పురా, కవాడిగూడ, విద్యానగర్, రామంతాఫూర్, రాణిగంజ్, సికింద్రాబాద్, తార్నాక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీలకు నిత్యం ఒక్కో సెంటర్‌కు రోజుకు 150 మంది వివిధ అనారోగ్య సమస్యలతో ఔట్ పేషెంట్లు వస్తుండటం గమనార్హం.
3వేల మందికి పైగా ఈఎస్ఐ కార్డుదారులకు ఒక్కోటి చొప్పున ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలోని పలు డిస్పెన్సరీల్లో మెడికల్ అధికారులు లేరు. దీంతో రోగులు వైద్యం కోసం ఇతర డిస్పెన్సరీలకు వెళ్లే పరిస్థితి నెలకొంటున్నది. కొన్ని చోట్ల తూతూ మంత్రంగా ఓపీ నిర్వహిస్తూ, మధ్యాహ్నం తరువాత సెంటర్లలో ఉండకపోవడంతో ఏఎన్ఎంలే చికిత్సనందిస్తున్న పరిస్థితి ఉంది.
ప్రైవేట్ ఫార్మసీలను ఆశ్రయిస్తూ..
దీర్ఘకాలిక వ్యాధులలో బాధపడుతూ డిస్పెన్సరీలకు వచ్చేవారికి నిరాశే మిగులుతున్నది. కావాల్సిన మందులు అందుబాటులో లేకపోవడంతో చేసేదిలేక ప్రైవేట్ ఫార్మసీల్లో కావాల్సిన మందులు కొనుక్కుంటున్నారు. ప్రతిసారీ పూర్తిస్థాయిలో కావాల్సిన మందులు ఇవ్వడం లేదని, వచ్చే జీతంలో మందులకే ఖర్చు చేయాల్సి వస్తున్నదని కార్మికులు వాపోతున్నారు.
మరోవైపు పలువురు డబ్బులు పెట్టే స్థోమత లేక, ఫార్మసిస్టులు చెప్పినట్లు అనేకసార్లు సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, పనులకు ఆలస్యంగా వెళ్తూ యజమానితో తిట్లు తింటున్నారు. పేద కార్మికులకు వరంగా మారిన ఈఎస్ఐ వైద్యాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది.