NTA | “విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్న ఎన్టీఏ వ్యవస్థపై, ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై నగర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ లాంటి పలు విద్యార్థి సంఘాలు, పలు వామపక్ష పార్టీలు గురువారం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ, ఆందోళన బాట పట్టాయి. పోటీ పరీక్షలైన నీట్, నెట్లను అవకతవకల మధ్య నిర్వహిస్తూ విద్యా రంగాన్ని దేశ వ్యాప్తంగా ఎన్టీఏ వ్యవస్థ చిన్నా భిన్నం చేస్తున్నదని, ఈ నేపథ్యంలో భావి పౌరుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్డీఏ ప్రభుత్వానికి చీమ కుట్టినైట్టెనా లేదని విద్యార్థి, నిరుద్యోగ లోకం నుంచి పెద్ద పెట్టున నిరసనలు పెల్లుబుకుతున్నాయి.”
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 20: దేశ వ్యాప్తంగా విద్యారంగంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. పరీక్షల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మానవ వనరుల శాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. పోటీ పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. యూజీసీ నెట్ పరీక్షను ఏటా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించేవారని గుర్తు చేశారు. ఈ ఏడాది దానిని ఎత్తివేసి, ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవి నాయక్, మల్సూర్, హుస్సేన్, కృష్ణ, శ్రీను, అరవింద్, పవన్, రాజ్‌కుమార్, శ్రీనాథ్, భవాని, నిర్మల, రమ్య, ముక్తి సౌజన్య పాల్గొన్నారు.
జాతీయ స్థాయి అర్హత పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, దాని గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో డిమాండ్ చేశారు. నీట్, యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు విద్యార్థి నాయకులు ఓయూలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వలిగొండ నరసింహ మాట్లాడుతూ, నీట్, నెట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని తెలిసినా, సంబంధిత అధికారులు చోద్యం చూస్తూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, బీఎస్ఎఫ్, డీబీఎస్ఏ, ఓయూజేఏసీ సంఘాల నాయకులు ఆర్ఎల్ మూర్తి, నరేశ్, ఎస్.నాగేశ్వరరావు, వేణుగోపాల్, జంగిలి దర్శన్, బోనాల నగేశ్, అల్లూరి విజయ్, రవినాయక్, నెల్లి సత్య, సుమంత్, సురేశ్, రవికుమార్, అభిలాష్ పాల్గొన్నారు.
సైదాబాద్ : నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని సీపీఎం హైదరాబాద్ సౌత్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తాలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్లు లీకైనట్లు బయటపడినా, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాల్లో ఆడుకుంటుందన్నారు. లీకేజీకీ పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని, నీట్ పరీక్షను వెంటనే రద్దుచేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు బాలు నాయక్, కోటయ్య, విఠల్ పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట, జూన్ 20: నీట్ ప్రవేశ పరీక్ష లీకేజీ కారకులను శిక్షించేలా న్యాయ విచారణ జరపాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. షాపూర్‌నగర్ రైతు బజార్ వద్ద గురువారం నిరసన తెలిపారు. రాష్ర్టాలే నిర్వహించేలా పారదర్శక విధానం తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్‌కు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బీరప్ప, స్వాతి, వెంకన్న, దేవదానం, కరుణాకర్, శ్రీను, మల్లారెడ్డి పాల్గొన్నారు.