మేడ్చల్, డిసెంబరు 13: పాఠశాలకు ఎలాంటి అనుమతులు, భవన నిర్మాణం జరగకుండానే ఓ పాఠశాల యాజమాన్యం వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించింది. మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట గ్రామంలో ఉన్న మూత పడిన పరిశ్రమలో సవరణ (ఎడిఫై) పేరుతో పాఠశాలను ప్రారంభిస్తున్నట్టు పేర్కొంటూ మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంఛర్ కమాన్ వద్ద ఉన్న ఓ భవనంలో పాఠశాల కార్యాలయాన్ని ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలను ప్రారంభిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. పాఠశాల ప్రారంభిస్తున్న చెపుతున్నట్టు చెపుతున్న పాఠశాలలో కూడా నిర్మాణ పనులు మొదలు కాలేదు. కానీ కరపత్రంలో మాత్రం క్రీడలు, స్విమ్మింగ్ తదితర ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రచారం నిర్వహిస్తూ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ మేడ్చల్లో ఉన్న పాఠశాల కార్యాలయానికి శుక్రవారం వెళ్లి, ఆందోళన నిర్వహించారు. అనుమతుల్లేకుండా ప్రవేశాలకు ఎలా తీసుకుంటారని యాజమాన్యాన్ని నిలదీశారు. మండల విద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే పాఠశాల కార్యాలయానికి వెళ్లి పాఠశాలకు సంబంధించిన పత్రాలను తీసుకెళ్లడంతో పాటు కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ, పాఠశాలకు సరైన భవనం లేకుండా మేడ్చల్ పట్టణంలో కార్యాలయం ప్రారంభించి, అడ్మిషన్లు స్వీకరిస్తున్నారన్నారు. కంపెనీ భవనంలో పాఠశాల నిర్వహించడం ఏమిటి? అని ప్రశ్నించారు. అనుమతులు, సరియైన వసతుల్లేకుండా ప్రవేశాల పేరుతో లక్షల రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎడిఫై పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, భవిష్యత్లో అనుమతు కూడా ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకలు కిరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.