సిటీబ్యూరో, జూలై 8(నమస్తే తెలంగాణ): పదో తరగతి బ్యాచ్‌మెట్స్ అందరూ రీ యూనియన్ పార్టీ చేసుకున్నారు. పాఠశాల నాటి గుర్తులను నెమరేసుకున్నారు. ఇందులో పాత స్నేహితులు ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. అందరికీ పెండ్లిళ్లయ్యాయి.. ఎవరి సంసారం వాళ్లకు ఉన్నది.. ఈ సమయంలో ఓ వ్యక్తి తన పదో తరగతి స్నేహితురాలి ఫోన్ నంబర్ తీసుకొని ఇటీవల వేధించడం మొదలుపెట్టాడు.
ఆ వేధింపులను భరించలేని బాధితురాలు రాచకొండ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలా వేధింపులకు గురయ్యే వారు నిర్భయంగా వచ్చి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు సూచించారు. గత నెల చివరి 15 రోజుల్లో రాచకొండ షీ టీమ్స్‌కు 215 ఫిర్యాదులు అందాలయని, అలాగే రోడ్లపై వేధింపులకు పాల్పడే 185 మంది పోకిరీలను షీటీమ్స్ పట్టుకున్నాయన్నారు.
బాలికలు, మహిళలను వేధించే పోకిరీలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. పట్టుబడ్డ ఈవ్టీజర్స్కు వారి కుటుంబసభ్యుల సమక్షంలో రాచకొండ ఉమెన్ సేఫ్టివింగ్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయం ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, సోషల్‌మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి బాధితురాలికి మెసేజ్‌లు పెడుతూ..‘నేను నీ బావనంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ’.. శారీరక సంబంధం పెట్టుకోవాలని లేదంటే, ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆ బెదిరింపులకు తలొగ్గకపోవడంతో బాధితురాలి ఫోన్ నంబర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.