కుత్బుల్లాపూర్, మే 22: రెండేండ్ల కిందట ప్రేమ పేరుతో బాలికను వైజాగ్ తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బాలానగర్‌లో విలేకరుల సమావేశంలో డీసీపీ సురేశ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. బాలానగర్ ప్రాంతానికి చెందిన బాలిక(13)కు సైనిక్‌పురి యాప్రాల్ కు చెందిన రాబిన్సన్ 2023లో ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఇంట్లోంచి డబ్బులు తీసుకురావాలని తెలుపడంతో బాలిక రూ.30వేలు తీసుకుని వచ్చింది.
రాబిన్సన్ బాలికను విశాఖపట్నం తీసుకువెళ్లి ఓ గదిలో ఉంచి ఆమెపై బలవంతంగా రెండుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. తిరిగి బాలికను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వదిలిపెట్టి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు బాలానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాబిన్సన్పై కిడ్నాప్, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా బుధవారం సికింద్రాబాద్ లోని బంధువుల ఇంటి వద్ద రాబిన్సన్ ఉన్నట్లు పోలీసులు సమాచారం అందుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ నరసింహరాజు, ఎస్ఐ వినోద్‌కుమార్, సీహెచ్ కృష్ణయ్య, ఎండీ బధీర్, శ్రీనివాస్‌లను డీసీపీ అభినందించి రివార్డులు అందజేశారు.
లైంగికదాడి కేసులో యువకుడు ..
బంజారాహిల్స్,మే 22: ప్రేమపేరుతో యువతిని లోబర్చుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో పాటు తీవ్రంగా హింసించిన ఘటనలో నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. కాజాగూడ ప్రాంతానికి చెందిన యువతి(28)కి ఫిలింనగర్‌లోని సినార్ కాలనీకి చెందిన అర్చిత్ పసుపులేటి(31) అనే యువకుడు రెండేళ్ల క్రితం పరిచయమయ్యాడు. ప్రారంభంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా చాటింగ్ చేసుకున్న వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆమె గర్భవతి కావడంతో పెళ్లికి టైమ్ ఉందంటూ అబార్షన్లు చేయించాడు. అనారోగ్యానికి గురైన యువతిని సూటిపోటి మాటలతో వేధిస్తుండడం, స్నేహితుల ముందు చులకన చేసి మాట్లాడడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా తాను కేవలం సహజీవనం మాత్రమే చేయాలనుకున్నానని, ఇద్దరం ఎంజాయ్ చేసి ఎవరి దారి వారు చూసుకోవాలని అర్చిత్ చెప్పడంతో ఇంటివద్దకు వెళ్లి నిలదీయగా అతడి కుటుంబ సభ్యులు తరిమివేశారు. బాధితురాలు రెండ్రోజుల క్రితం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడు అర్చిత్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఫిబ్రవరిలో కేసు ఎందుకు పెట్టలేదు..?
ఇదిలా ఉండగా.. బాధిత యువతి తనకు జరిగిన అన్యాయంపై ఫిబ్రవరిలోనే ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రముఖులు నివాసం ఉంటున్న సినార్ కాలనీలో తీవ్ర అనారోగ్యంతో అర్చిత్ ఇంటికి వెళ్లిన తనను అతడి స్నేహితులు కావ్యా పొట్లూరి, ఆదిత్య సయ్యపరాజు తరిమికొట్టారని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్న తాను అపస్మారకస్థితిలోకి చేరుకునే దశలో పెట్రోలింగ్ పోలీసులు కాపాడి అపోలో ఆస్పత్రిలో చేర్చారంటూ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఫిబ్రవరి 24 నుంచి 26 దాకా తాను అపోలో ఆస్పత్రిలో ఉన్నానని డిశ్చార్జ్ అయిన తరవాత నేరుగా ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాలను చెప్పడంతో పాటు సాక్ష్యాలను చూపించినా ఏ మాత్రం పట్టించుకోలేదంటూ బాధితురాలు ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేయకపోవడంతో పాటు ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బాధితురాలి చేత రాజీ పత్రం రాయించారనే ఆరోపణలను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారించి తగిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.