మరికొద్ది రోజుల్లో కేసీఆర్ కల సాకారం కానున్నది. హైదరాబాద్ నగరాన్ని మురుగునీటి నుంచి విముక్తి కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్టీపీ ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో గ్రేటర్‌కు మురుగునీటి నుంచి విముక్తి కలుగనున్నది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నాటి బీఆర్ఎస్ సర్కార్ రూ. 3,866.41 కోట్లతో 1259.50 ఎంఎల్డీ సామర్థ్యంతో 31 ఎస్టీపీలను 27 చోట్ల చేపట్టారు.
ఇప్పటికే ఐదు ఎస్టీపీలు వినియోగంలోకి రాగా, మరో ఆరు ప్రాంతాల్లో ప్రారంభించేందుకు జలమండలి అధికారులు సిద్ధమయ్యారు. మిగిలిన ఎస్టీపీలను డిసెంబర్ నెలాఖరులోగా తీసుకురానున్నారు. దీంతో మురుగు నీటిని 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టించనున్నది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముళ్లీ మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు సిద్ధమవుతున్నది.
– సిటీబ్యూరో, సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ)
GHMC | గ్రేటర్లో మురుగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. రోజూ ఉత్పన్నమయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా ఎస్టీపీ (సీవరేజీ ట్రిట్మెంట్ ప్లాంట్) ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు ప్యాకేజీల్లో మొత్తం రూ. 3,866.41 కోట్లతో 1259.50 ఎంఎల్డీ సామర్థ్యంతో 31 కొత్త ఎస్టీపీలను నిర్మించింది. వీటి నిర్మాణ బాధ్యతను జలమండలి చూస్తున్నది. ఐదు సర్కిళ్లలో అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో ఈ కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతున్నది.
31 ఎస్టీపీల్లో గత అసెంబ్లీ ఎన్నికల ముందే కోకాపేట, దుర్గం చెరువు ఎస్టీపీలను అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కాగా ప్రస్తుతం గ్రేటర్లో ప్రతి రోజు 1950 ఎంఎల్డీల మురుగునీరు ఉత్పన్నమవుతున్నది. జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1650 ఎంఎల్డీ, ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీ నీటిని (46శాతం) శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం. మిగిలిన 1259.50 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేయడానికి గానూ కేసీఆర్ ప్రభుత్వం రూ. 31 ఎస్టీపీలను 27 చోట్ల నిర్మాణ పనులు చేపడుతున్నది.
బీఆర్ఎస్ హయంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఎస్టీపీలతో వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసి మూసీని ప్రక్షాళన చేయగా… ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరిట మూడు నెలల్లోనే లక్ష కోట్లకు పెంచేశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రూ. 50వేల కోట్లతో మూసీకి పునరుజ్జీవం పోస్తామంటూ ప్రకటించారు. ఆ తర్వాత ఐదేళ్లలో లక్షన్నర కోట్లను ఖర్చు చేస్తామని గోపన్‌పల్లి ఫ్లై ఓవర్ వేదికగా గొప్పలు చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇలా ఉంటే అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి పచ్చి అబద్ధాలే మాట్లాడారు. ఇందుకు మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పవచ్చు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ విజనరీ లీడర్‌షిప్‌తో రూ. 71వేల కోట్లతో మూసీ మురుగు తొలగిస్తామని , లండన్‌లోని థేమ్స్ నది తరహాలో మూసీని తీర్చిదిద్దుతామన్నారు.
గడిచిన 10 నెలలుగా మూసీ సుందరీకరణపై ఎలాంటి పురోగతి లేకున్నా.. కాగితాల దశలోనే ఏకంగా రూ. లక్ష కోట్లకు పెరిగిపోవడంతో.. మూసీ ప్రక్షాళన పూర్తయ్యేలోపు నిర్మాణ వ్యయం ఇంకెంత పెరుగుతుందోనని అనుమానం వ్యక్తం అవుతుంది. శాస్త్రీయ విధానాల్లేవు, పర్యావరణ పరిస్థితుల అంచనా లేవు కానీ మూసీని సుందరమైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చుదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవడం ఇప్పుడొక చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఇప్పటివరకు చేపట్టిన ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ కూడా ప్రజా ధనం దుర్వినియోగం చేశారనే విమర్శలను ముట్టగట్టుకున్నాయి. ఎలాంటి శాస్త్రీయ విధివిధానాలు లేకుండానే లక్ష కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడం పలు అనుమానాలకు తావిస్తోండగా…ఈ ప్రాజెక్టు కూడా మురుగులో పోసిన మంచినీటి లాంటిదే అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ(ఎస్బీఆర్)తో ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. మెట్రో నగరాల్లో స్థలాభావం ఉంటుంది కాబట్టి ఎస్బీఆర్ టెక్నాలజీతో నిర్మాణం అనువుగా ఉంటుంది. వీటి వల్ల ఒకే ఛాంబర్లో ఐదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరిగి.. తకువ విస్తీర్ణంలో ఎకువ నీటిని శుద్ధి చేస్తాయి. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయాలాజికల్ ట్రీట్ మెంట్ పద్ధతుల కంటే ఈ ఎస్బీఆర్ విధానానికి తకువ ఖర్చు కావడంతో పాటు మెరుగ్గా మురుగునీటి శుద్ధి జరుగుతుంది.
ఇది తేలికైన విధానం. దీనికి విద్యుత్ వినియోగం కూడా తకువగా ఉంటుంది. యూఏఎస్బీఆర్ టెక్నాలజీ, ఎంబీబీఆర్ టెక్నాలజీ కంటే ఎస్బీఆర్ టెక్నాలజీతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కేవలం మూడు గంటల వ్యవధిలో మూడు విడుతల్లో మురుగునీటి శుద్ధి జరిగి, తాగేందుకు తప్ప నిర్మాణ రంగానికి, పార్కులు, వాహనాల వాషింగ్ ఇతర అవసరాలను ఈ వాటర్‌ను వినియోగించవచ్చు. నిరంతరం స్కాడా విధానంలో పర్యవేక్షణ, అధునాతన శుద్ధి విధానం ఎస్బీఆర్ సొంతం అని అధికారులు చెబుతున్నారు.
నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలను రూపొందించింది. ఎలాంటి శుద్ధి లేకుండా యథేచ్ఛగా మూసీలోకి కలుస్తున్న మురుగుకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. జలమండలి పరిధిలో ప్రస్తుతం 1950 ఎంఎల్డీ (జీహెచ్ఎంసీ పరిధిలో 1650, ఓఆర్ఆర్ పరిధిలో 300 ఎంఎల్డీ)ల మేర మురుగు ఉత్పత్తి అవుతుంది.
2036 నాటికి 2,814 ఎంఎల్డీ, 2051నాటికి 3,715 ఎంఎల్డీ మురుగు ఉత్పత్తి అవుతుందని సీవరేజీ మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో భాగంగా ముంబైకి చెందిన షా కన్సల్టెన్సీ ప్రతిపాదించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 31, ఓఆర్ఆర్ పరిధిలో 31 ఎస్టీపీలను నిర్మించాలని నాటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్న రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. మూసీ సుందరీకరణ, ఓఆర్ఆర్, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోను మురుగు నీటిని శుద్ధి చేసే విధంగా ఎస్టీపీలకు ప్రణాళికలు రూపొందించి అమృత్ పథకం కింద ప్రతిపాదనలు అందజేసింది.
అదనంగా 965 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేసేలా మరో 39 ఎస్టీపీలకు ఇటీవల కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ అమృత్ పథకం కింద ఆమోదం తెలిపింది. హెచ్ఏఎం విధానంలో చేపట్టనున్న 39 ఎస్టీపీలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. అమృత్ 2.0 ద్వారా మొత్తం 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించడానికి రూ. 3,849 కోట్ల నిధులను కేటాయించింది. ఓఆర్ఆర్, జీహెచ్ఎంసీ, మూసీ నది ప్రక్షాళనతోపాటు సిటీ శివారుల్లో ఉన్న పురపాలక సంస్థల కోసం వీటిని నిర్మించనున్నారు. మొత్తం 39 ఎస్టీపీల నిర్మాణానికి కేంద్రం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, పీపీపీ విధానంలో సదరు ఏజెన్సీ 40శాతం చొప్పున నిధులను వెచ్చించనున్నారు.
సాధారణంగా మురుగునీటి శుద్ధి కేంద్రాల పరిసర ప్రాంతాల్లో మురుగు నీటితో దుర్వాసన వెదజల్లుతుండేది. ఒక పక్క కొత్త ఎస్టీపీలకు స్థలాల ప్రభావం, జనావాసాల్లో ఉన్న స్థలాల్లో ఎస్టీపీల నిర్మాణం అంటే కంపు, దోమల బెడద వద్దంటూ స్థానికులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అడుగడుగునా అడ్డుతగిలేవారు. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించి 31 నూతన ఎస్టీపీలను చేపట్టింది. ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండేందుకుగాను అధునాతన సాంకేతికను వినియోగిస్తూ స్థానికులకు పూర్తి భరోసా ఇచ్చేలా ఎస్టీపీలను తీసుకువచ్చింది.