మన్సురాబాద్, మార్చి13: నకిలీ ఇండియన్ కరెన్సీని చలామణి చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న కేసులో ఏడుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్ పల్లి, నిజాంపేటకు చెందిన చిన్న మాణిక్యరెడ్డి(49) పెద్ద అంబర్పేట్, శబరి హిల్స్ కాలనీలో నివాసముంటున్నాడు. ఫైనాన్స్ వ్యాపారస్తుడైన మాణిక్యరెడ్డి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో.. ఆన్లైన్లో డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు. నకిలీ కరెన్సీ వ్యాపారం చేసే గుజరాత్ కు చెందిన సురేష్ అలియాస్ సురేష్ బాయ్ ని పరిచయం చేసుకున్నాడు. నకిలీ కరెన్సీ అవసరాన్ని సురేష్ కు తెలియజేశాడు.
సురేష్ కు ఒరిజినల్ ఇండియన్ కరెన్సీ ఒక లక్షను అందజేసి రూ. 11.50 లక్షల నకిలీ కరెన్సీని తీసుకున్నాడు. నల్గొండ జిల్లా, దోమల పల్లె మండలం, పరపల్లిగూడెం కు చెందిన మామిళ్ళ జంగయ్య(34), రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లోయపల్లి కి చెందిన బిలకంటి భరత్ కుమార్(36), మహబూబ్నగర్ జిల్లా, చిన్న చింతకుంట మండలం, ముచ్చింతల గ్రామానికి చెందిన జెల్లా వెంకటేష్ (31), రంగారెడ్డి జిల్లా, మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన డొంకని సత్యనారాయణ(40), రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్పేట్, శబరి హిల్స్ కాలనీకి చెందిన గుండాల వెంకటేష్(28)ను మాణిక్య రెడ్డి కలుసుకొని నకిలీ కరెన్సీ వ్యాపారంపై తెలిపారు. మామిళ్ళ జంగయ్య పలువురిని మాణిక్య రెడ్డి వద్దకు తీసుకువచ్చి లక్ష ఒరిజినల్ కరెన్సీ ని అప్పగించి.. నాలుగు లక్షల నకిలీ కరెన్సీని పలుమార్లు ఇప్పించాడు.
గురువారం శివశంకర్ ఒరిజినల్ కరెన్సీ రూ. 4 లక్షలు తీసుకొని హైదరాబాద్ కు వచ్చాడు. నకిలీ కరెన్సీ మార్పిడి విషయంపై ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎల్బీనగర్, చింతలకుంట ఓల్డ్ చెక్ పోస్ట్, మ్యాక్ డోనాలడ్స్ ఎదురుగా మాణిక్య రెడ్డి, మామిళ్ల జంగయ్య, బిలకంటి భరత్ కుమార్, జెల్లా వెంకటేష్, డంకని సత్యనారాయణ, గుండాల వెంకటేష్, కె శివశంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 11.50 లక్షల నకిలీ ఇండియన్ కరెన్సీ, రూ. 4 లక్షల ఒరిజినల్ కరెన్సీ, 7 సెల్ ఫోన్లు, హోండా సిటీ కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీని సరఫరా చేసిన అహ్మదాబాద్ కు చెందిన సురేష్ ఫరారీలో ఉన్నాడు. నిందితులైన ఏడుగురుని పోలీసులు రిమాండ్ కు తరలించారు.