OU | ఉస్మానియా యూనివర్సిటీ : గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. డైసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మహా భోగ్ భండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశరెడ్డి, ఓఎస్టీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సేవాలాల్ జీవిత చరిత్రను వివరించారు. జాతి కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహామనిషి సేవాలాల్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి జయంతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి సేవాలాల్ జయంతికి ప్రభుత్వం పూర్తి సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో సేవాలాల్ ఆలోచనా విధానాలను పాటించడం ద్వారా మూఢనమ్మకాలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. గిరిజన సంస్కృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన సమాజమంతా జ్ఞానం వైపు మరలాలని, అది విద్య ద్వారానే సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో 30 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయలేదని గుర్తు చేశారు. పదిహేనేళ్లుగా అధ్యాపక భర్తీ నిర్వహించలేదన్నారు. వివిధ విద్యార్ధి సంఘాల నాయకులు మహనీయుల స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమించి, వాటిని సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, సైఫాబాద్ పీజీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మణ్‌నాయక్, ప్రొఫెసర్ నతానియేల్, ప్రొఫెసర్ చందులాల్, డాక్టర్ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ జయంతి సందర్భంగా రాక్ ఆర్టిస్ట్ ఇస్లావత్ వెంకన్న ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. బంజారా జాతి హక్కులు, సమాజ సేవ కోసం సేవాలాల్ మహారాజ్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. కుల, మత బేధాలు లేని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడని కీర్తించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాజేందర్ నాయక్, గణేశ్‌నాయక్, చరణ్ నాయక్, రవినాయక్, కళ్యాణ్ నాయక్, సందీప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.