ముషీరాబాద్, జూలై 26 : జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, కొత్త ఓటర్ జాబితా రూపకల్పనపై చర్చిండానికి బుధవారం అధికారులు వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. సర్కిల్-15 డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య తన కార్యాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై తుది ఓటరు జాబితా తయారు, పోలింగ్ బూత్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించి అభ్యంతరాలను స్వీకరించారు. ఓటర్ల జాబితాలో సవరణలు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై చర్చించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న పలు పోలింగ్ బూత్‌లను మార్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించారు. ఓటరు జాబితాలో నకిలీ ఓట్లు, చనిపోయిన వారు, చిరునామా మారిన వారి పేర్ల పరిశీలన, తొలగింపు, పోలింగ్ స్టేషన్ల మార్పులు చేర్పులపై చర్చించారు. పస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల కొనసాగింపు, ఓటర్లకు అనువుగా ఉండే చోటికి పోలింగ్ కేంద్రాల మార్పు నేత అభిప్రాయాలను తెలుసుకున్నారు. సర్కిల్ పరిధిలో ఓటరు పరిశీలన చేపట్టి పారదర్శకంగా తుది జాబితా సిద్ధం చేయాలని వివిధ పార్టీల నేతలు కోరారు. పలు బస్తీలు, కాలనీలకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను మార్చి అనువైన చోట ఏర్పాటు చేయాలన్నారు.
ఓటర్లకు అనువుగా లేని, వివిధ కారణాలతో పలు పోలింగ్ బూత్‌లను మార్చడానికి గాను ప్రతిపాదనలు ఎన్నికల అధికారులకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. నల్లకుంట జ్యోతి బాలమందిర్ స్కూల్లో కొనసాగుతున్న 256, 257, 262, 263, 264, 265 పోలింగ్ బూత్‌లను ఎస్వీఎస్ కాలేజ్, స్కూల్లోకి, గాంధీనగర్ విద్యాదిక్ హైస్కూల్ పోలింగ్ బూత్ చిరునామా మార్పు, తెలగకాపు బలిజ సంఘంలోని పోలింగ్ బూత్‌లను 63,64 రజక కాలనీ కమ్యూనిటీహాల్, కవాడిగూడ కేంబ్రిడ్జ్ స్కూల్లోని 72,73 లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లోకి, దాయర మార్కెట్లోని వెస్లీ కేజీఎన్ ప్రైమరీ స్కూల్లోని 152, 153,154, 155, 156 పోలింగ్ బూత్‌లను సున్నంబట్టి సెయింట్ లూయిస్ స్కూల్, పరిశ్రమల భవనంలోని 168, 169, 170 పోలింగ్ బూత్‌లను ఐటీఐ భవనంలోకి, జెమినీ కాలనీ గ్రంథాలయ భవనంలో ఉన్న 175, 176 రెడ్ కాన్వెంట్ స్కూల్లోకి మార్చే విషయమై ప్రతిపాదనలు చేసిన ఎన్నిక సంఘానికి పంపినట్లు తెలిపారు. నల్లకుంట జ్యోతి బాలమందిర్ స్కూల్లో కొనసాగుతున్న పోలింగ్‌బూత్‌లను అడిక్‌మెట్ వార్డు ఆఫీసు, కోపుగుంతల కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల నేతలు కోరగా.. పరిశీలించి ఎన్నికల సంఘం అధికారులకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గంగపుత్ర సంఘంలోని పోలింగ్ బూత్‌లను 98, 99 మార్చాలనే ప్రతిపాదనలు పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల మార్పు విషయంతో రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన జరుపనున్నట్లు డీఎంసీ తిప్పర్తి యాదయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సూపరిండెంట్ భీమ్రావు, లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి మాధవ్, ఎర్రం శ్రీనివాస్ గుప్త, వాజిద్ హుస్సేన్(కాంగ్రెస్), రామేశ్రామ్(బీజేపీ), చంద్రమోహన్ గౌడ్(టీటీడీపీ)తోపాటు బీఎస్పీ, ఆప్, వామపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.