కంటోన్మెంట్, నవంబర్16: ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో పని మనుషులుగా చేరి మత్తు మందు ఇచ్చి చోరీ చేసిన ఘటన కార్ఖానా పీఎస్ పరిధిలో ఆదివారం సంచలనం సృష్టించింది. తిరుమలగిరి ఏసీపీ రమేశ్, సీఐ అనురాధ వివరాల ప్రకారం.. గన్‌రాక్ కాలనీ ప్లాట్ నంబర్ 210లో నివాసం ఉండే రిటైర్డ్ ఆర్మీ అధికారి డీకే గిరి ఇంట్లో నేపాల్‌కు చెందిన రాజ్, పూజ దంపతులు గత నెల 21న పని మనుషులుగా చేరారు. శనివారం గిరి కుటుంబం బయటికి వెళ్లి వచ్చారు. కాగా నేపాలి దంపతులు ఆర్మీ అధికారితో పాటు కుటుంబ సభ్యులకు, మరో పనిమనిషికి మత్తు పదార్థం కలిగిన పానీయం ఇచ్చారు. వాళ్లు స్పృహ కోల్పోవడంతో మరో నలుగురు ఘటన స్థలానికి కారులో వచ్చారు.
అందరు కలసి దొంగతనం చేస్తున్న సమయంలో గిరి మేల్కోనగా అతడిని కుర్చికి తాళ్లతో కట్టేసి కర్రతో దాడి చేసి 22 తులాల బంగారు నగలు, రూ.95 వేలు నగదు ఎత్తుకొని పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. నార్త్‌జోన్ అదనపు డీసీపీ అశోక్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Hyd5