ఖైరతాబాద్ : పంజాగుట్ట పీఎస్ పరిధిలో మహిళ అనుమానస్పద మృతి ఘటనలో పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 23న బేగంపే ట గ్రీన్‌ల్యాండ్స్ ప్రధాన రహదారిలో అసోంకు చెందిన మహిళ(30) రోడ్డుపై విగతజీవిగా పడి ఉంది. స్థానిక ఓ టీస్టాల్ నిర్వాహకుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనంతపురం జిల్లా నల్లచెర్వు మండలం ఎనమల్లపల్లికి చెందిన వై.రెడ్డప్ప(38) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు వచ్చిన రెడ్డప్ప ఆమెను మాటల్లో పెట్టి మద్యం తాగించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు ప్రతిఘటించగా తీవ్రంగా కొట్టి గొంతునొక్కి హత్య చేశాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.