సిటీబ్యూరో, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ) : డిసెంబర్ అంటే మిణుకుమిణుకు తారలు.. శాంతాక్లాజ్ సందళ్లు.. క్రిస్మస్ వంటకాల ఘుమఘుమలు.. మొత్తంగా క్రిస్మస్ పండుగ అంటే మరువలేని ఓ తియ్యని అనుభూతిని పంచే వేడుక. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకను క్రైస్తవులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సారి సంప్రదాయ, ఆధునిక వంటకాల కలబోతతో పండుగ చేసుకుని హ్యాపీ హ్యపీ క్రిస్మస్.. మెర్రీమెర్రీ క్రిస్మస్ అంటూ ఆత్మీయంగా పలుకరించుకునేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఈ అపూర్వమైన యేసు పుట్టినరోజు వేడుకను ఈనెల 25న ఘనంగా జరుపుకునేల గ్రేటర్ ముస్తాబైంది.
క్రిస్మస్ అంటేనే కేకులు అనేంతలా సందడి ఉంటుంది. కేకు కటింగ్ లేకుండాక్రిస్మస్ వేడుకలు ముగియవు. అందుకే ప్లమ్ కేకు, ఫ్రూట్ కేకు, లో కొలెస్ట్రాల్ కేకు తదితరవన్నీ కేకులు విభిన్న రకాలుగా ముస్తాబయ్యాయి. నగరంలోని క్రిస్మస్ దుఖాణాలు.. పూర్తి సామగ్రితో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. సికింద్రాబాద్, కోఠి, దిల్షుక్నగర్ తదితర ప్రాంతాల్లో షాపులన్నీ క్రిస్మస్ సామగ్రితో కళకళలాడుతున్నాయి. స్కూల్స్లో చిన్నారులతో సాంటక్లాజ్ లాంటి గెటప్లతో పండుగలు జరుపుకుంటున్నారు.