బండ్లగూడ, మార్చి 7 : నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమిని విక్రయించిన కేసులో 8 మందిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. రాజేంద్రనగర్ డీసీపీ చిం తమనేని శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమాజిగూడకు చెందిన వినీతా చౌదరికి గండిపేట మండలం, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మశ్రీ హిల్స్ లో 600 చదరపు గజాల స్థలం ఉంది. ప్రస్తుతం ఆమె చెన్నైలో నివాసం ఉంటున్నారు.
ఇక్కడే ఉన్న గుండాడ నాగేశ్ అనే బ్రోకర్‌తో పరిచయం ఏర్పడగా తరచూ తమ ప్లాటు యొక్క విలువను తెలుసుకుంటూ ఉంది. దీంతో నగేశ్.. మరో బ్రోకర్ జీసస్ ఇమ్మానియేల్ తో కలిసి ఆ ప్లాట్‌ను విక్రయించేందుకు నకలీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. దీనిని 2024లో నాగోల్‌లో ఉండే సుభాషిని అనే మహిళకు విక్రయించారు. తదనంతరం ఫిబ్రవరి 17, 2025న ధ్రువంతీర కన్స్ట్రక్షన్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి లకు నాలుగు కోట్ల 26 లక్షలకు అమ్మేశారు.. దీనికి వల్లి అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించారు.
వాళ్లు న్యాయపరమైన అభిప్రాయం కోసం న్యాయ నిపుణులతో కలిసి పరిశీలించగా నకిలీ బాగోతం బయటపడింది. వినీతా చౌదరి, శ్రీనివాస్ రెడ్డి , భరత్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులు ఇమ్మానియేల్, నాంపల్లి దివాకర్ వర్మ, సుభాషిని, నాగేశ్, దగాని పుష్పకుమారి, చంద్రమోహన్, అనిల్, వల్లి లను అరెస్టు చేయగా రోహన్, అలెక్స్, శివరాజ్, శ్రేయ, ఇతరులు పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారి నుంచి ఒక కోటి 69 లక్షల రూపాయల నగదు, ఫార్చునర్ కారు, ఎక్స్‌యూవీ 700 కారు, ఎస్ క్రాస్ కారు, 7 సెల్ఫోన్లను, ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకు న్నారు