ఖైరతాబాద్, ఏప్రిల్ 1: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సహకారంతో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు కడ్తాల్ మండలం, అన్మాస్పల్లి గ్రామంలోని ది ఎర్త్ సెంటర్లో విత్తన పండుగ పేరుతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ సలహాదారులు ఆర్. దిలీప్ రెడ్డి తెలిపారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహజ సమృద్ధి వ్యవస్థాపకులు కృష్ణ ప్రసాద్, ప్రజా విధాన నిపుణుడు ప్రొఫెసర్ దొంతి నర్సింహా రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ అధ్యక్షురాలు లీలా లక్మా రెడ్డితో కలిసి వివరాల వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి సారిగా నిర్వహిస్తున్న ఈ విత్తన పండుగలో 50 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సేంద్రియ విత్తనాలను, వంగడాలను ప్రదర్శిస్తామని తెలిపారు.