హైదరాబాద్: మరో ప్రాణాన్ని లిఫ్ట్ బలిగొన్నది. రెండు రోజుల క్రితం సిరిసిల్లలో 17వ బెటాలియన్ ఇన్చార్జి కమాండెంట్ తోట గంగారాం ప్రమాదవశాత్తు లిఫ్టులో పడి మరణించిన విషయం మరువకముందే.. హైదరాబాద్‌లో (Hyderabad) మరో ఘటన చోటుచేసుకున్నది. ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంతోష్‌నగర్ కాలనీలో ముజ్తాబా అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేండ్ల చిన్నారి సురేందర్ మరణించాడు. ఆరు అంతస్తులున్న అపార్టుమెంట్లో మెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. సురేందర్ తండ్రి శ్యామ్ బహదూర్ అక్కడే వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. దీంతో సురేందర్ కుటుంబం లిఫ్ట్‌పక్కనే చిన్న గదిలో ఉంటున్నది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సురేందర్ ఆడుకుంటూ.. లిఫ్ట్ తలుపు మధ్యకు వెళ్లాడు. అయితే కుమారు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అతని కోసం వెతకగా.. లిఫ్ట్‌మధ్యలో ఇరుక్కుని రక్తపుమడుగులో అపస్మారక స్థితిలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడుని సమీపంలో ఉన్న దవాఖానకు తరలించారు. అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుని మరణంతో జీవనోపాధి కోసం నేపాల్ నుంచి నగరానికి వచ్చిన బహదూర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది.