సిటీబ్యూరో, జూలై 4(నమస్తే తెలంగాణ): మొహరం సంతాప దినాలను పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం మొహరం 8వ రోజు సందర్భంగా దార్-ఉల్-షిఫా, డబీర్‌పురాలోని బీబీ కా ఆలంను కమిషనర్ ఆనంద్‌తోపాటు పోలీసు అధికారులు సందర్శించి అక్కడ పుష్పగుచ్ఛాలు, దట్టీలు సమర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
అనంతరం ఆనంద్ మాట్లాడుతూ.. మొహరం ప్రారంభానికి ముందే ప్రభుత్వం తరపున షియా మత పెద్దలు, పోలీసులు, ఇతర శాఖల అధికారులతో అనేక సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ట్రాఫిక్ బందోబస్తు విషయంలో బయటి నుంచి అదనపు పోలీసు సిబ్బందిని రప్పించి, ట్రాఫిక్ డీసీపీల ఆధ్వర్యంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఊరేగింపు సమయాల్లో స్నాచింగ్‌లు, జేబు దొంగతనాలు, ఈవ్ టీజింగ్‌లు జరిగే అవకాశం ఉన్నందున, క్రైమ్ పోలీసులు, షీటీమ్స్ అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
శని, ఆదివారాల్లో ప్రజలు సందర్శించే అవకాశం ఉన్నందున, ముందస్తు చర్యలో భాగంగా 3వేల మంది పోలీసులతో మొహరం ఊరేగింపు శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం ఆనంద్ మొహరం ఊరేగింపు మార్గాలను సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మెహ్రా, ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులతో కలిసి పరిశీలించి, ప్రశాంత వాతావరణంలో ఊరేగింపు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.