అడ్డగుట్ట, ఫిబ్రవరి 6 : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి వాటి అమలులో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని ఎద్దేవా చేశారు. గురువారం తుకారాంగేట్ రియో పాయింట్ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, అడ్డగుట్ట, బౌద్ధనగర్ కార్పొరేటర్లు లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివాస్, కంది శైలజ మారేడుపల్లి తహసీల్దార్ భీమయ్య గౌడ్‌తో కలిసి 91మంది లబ్ధిదారులకు 91 లక్షల విలువ చేసే కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. పెళ్లికానుకగా తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పారు. కులగణన మొత్తం తప్పుల తడక అని, తూతూమంత్రంగా సర్వేని నిర్వహించి వందశాతం చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అసమర్థ పాలనను కొనసాగిస్తున్నదని, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతున్నదని ఆయన చెప్పుకొచ్చారు.
ఆరు గ్యారంటీలు అడ్రస్ లేకుండా పోయాయని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అబద్ధాలపై ఎక్కువ రోజులు ముందుకు సాగలేమని స్పష్టం చేశారు. పేద ప్రజల కష్టాలను తెలుసుకొని పాలనను అందించిన ఘనత బీఆర్‌ఎస్‌దీ అని, ప్రజల సమస్యలను గాలికి వదిలి ఇబ్బందుల పాలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగాని శ్రీనివాస్, నక్కమధు, మనోహర్, సత్తయ్య గౌడ్, వసంత, ఎల్లయ్య, అమర్ బాన్సోడే, మహ్మద్, కుమార్ వంశీ, దేవయ్య, మోహన్, శ్రీనివాస్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ కేసీఆరే సీఎం
కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసుగుచెందుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ కేసీఆర్‌యే సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. పోరాటానికిమ బీఆర్ఎస్ క్యారకర్తలు పెట్టిన పేరని, కష్టంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడ్డారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే చిల్లర గొడవలకు, ఆకతాయి చేష్టలకు వెనకకు పోయేది లేదని, వాటి రెట్టింపుగా తిప్పికొడుతామని ఆయన పేర్కొన్నారు. కాగా, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కొద్దిసేపు పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది.