Cantonment Elections | కంటోన్మెంట్, జనవరి 31: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి జూన్ లేదా జులైలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం పొందకపోవడంతో పాటు ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ ఏరియా నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ క్రమంలోనే కంటోన్మెంట్‌పై దృష్టి సారించిన రక్షణ శాఖ పాలకమండలి ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత మూడేళ్లుగా కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా దేశంలోని పలు కంటోన్మెంట్లను ఆయా స్థానిక మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రక్షణ శాఖ నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారని ప్రచారం జరిగింది. కొత్త చట్టం ఆమోదం లభించకపోవడంతో పాటు ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేకపోవడంతో కంటోన్మెంట్ ఏరియాలో గత కొన్నేళ్లుగా అభివృద్ధి పడకవేసింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా పలు కంటోన్మెంట్లకు ఎన్నికలు నిర్వహించి, పాలకమండలిని ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లకు 2023 ఏప్రిల్ 30న ఎన్నికలు జరపాలని గతంలో రక్షణ శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. కానీ ఆ తర్వాత యూ టర్న్ తీసుకొని.. ఎన్నికలు వాయిదా వేస్తూ గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కంటోన్మెంట్ల ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని కొద్ది నెలల క్రితమే పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. త్వరలోనే మరికొందరు కూడా కోర్టుకు వెళ్లనుండటంతో ఎన్నికల నిర్వహణపై రక్షణ శాఖ మరోసారి దృష్టి సారించినట్టు సమాచారం. ప్రధానంగా కంటోన్మెంట్ విలీనంపై కేంద్ర రక్షణ శాఖ సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. ఎన్ని కమిటీలు వేసినా సమస్య కొలిక్కి రాకపోవడంతో ఎన్నికలపై రక్షణశాఖ దృష్టి సారించినట్లు తేటతెల్లమవుతుంది. అయితే ఎన్నికల నిర్వహణపై మాత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్పందించడం లేదు. రక్షణ శాఖ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేమని, కంటోన్మెంట్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా రక్షణ శాఖ తలచుకుంటే ఎన్నికలు ఏ క్షణంలోనైనా నిర్వహించవచ్చంటూ అనధికారికంగా వ్యాఖ్యానించారు.
గతంలో ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడటం, జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్‌ను విలీనం చేస్తారంటూ ప్రచారం జరగడంతో అప్పటి ఆశావాహులు అందరూ ప్రజాక్షేత్రాన్ని విడిచి ఎవరి పనిలో వాళ్లు పడిపోయారు. కానీ పాలక మండలికి ఎన్నికలు జరగబోతున్నట్లు తాజాగా మళ్లీ ఊహాగానాలు వినిపిస్తుండటతో ఆశావాహులు మళ్లీ అప్రమత్తమవుతున్నారు. రణక్షేత్రంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు.