OTS | సిటీబ్యూరో: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నీటి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) అవకాశాన్ని కల్పిస్తూ ఈ నెల 4న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. 31లోగా నీటి బకాయిదారులందరూ నీటి బిల్లుపై ఎలాంటి అలస్య రుసుం, వడ్డీ లేకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్కారు సూచించింది.
అయితే ఉత్తర్వులు వెలువడి 16 రోజులైనా..ఓటీఎస్ అమలు కాలేదు. డివిజన్ల వారీగా ఓటీఎస్ లబ్ధిదారులను ప్రత్యేకంగా గుర్తించి, ప్రత్యేక యాప్ విధానాన్ని తీసుకువస్తున్నామని చెబుతూ.. రెండు వారాలు దాటినా సాంకేతిక సమస్యలను అధిగమించడం లేదు. ఇంకో పది రోజుల్లో ఓటీఎస్‌కు ఇచ్చిన గడువు ముగిస్తున్నది. సంస్థలో ఇద్దరు ఐఏఎస్‌లు, సీనియర్ డైరెక్టర్లు ఉన్నా అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రెవెన్యూ విభాగం అధికారులు మాత్రం ఓటీఎస్ విధానం అమల్లో జరుగుతున్న మార్పులతో ఆలస్యమైందని, సోమవారం (నేటి) నుంచి అర్హులైన వినియోగదారులందరికీ ఎస్ఎంఎస్లు వెళ్తాయని చెబుతున్నారు.
మొత్తం 7.18 లక్షల కనెక్షన్లకు ఓటీఎస్ వర్తించనుంది. రూ. 1961 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉండగా, ఇందులో రూ.705 కోట్ల మేర వడ్డీ మాఫీ కానుంది. రూ. 1255 కోట్ల మేర బకాయిలు వసూలు చేయడమే లక్ష్యంగా ఓటీఎస్‌ను డివిజన్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. అయితే ఓటీఎస్ ఆలస్యానికి ప్రధాన కారణం గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారుల గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ స్కీంలో గతంలో లబ్ధిపొందిన వారికి ఈ సారి 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది.
గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు ఒకేసారి బిల్లు చెల్లిస్తే ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ రాసివ్వాలి. నల్లా కనెక్షన్ యాక్టివ్‌లో ఉన్న వారు మాత్రమే అర్హులు. మేనేజర్ స్థాయిలో రూ. 2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10వేలు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ. లక్ష వరకు , చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది.
వివిధ ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలు పేరుకుపోయాయి. దాదాపు 40 సంస్థల నుంచి రూ.1660కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ రూ.56.30 కోట్లు, హౌసింగ్ రూ.33కోట్లు, ఇరిగేషన్ రూ.21కోట్లు , పంచాయతీ రాజ్ రూ.37కోట్లు, మిషన్ భగీరథ రూ. 82కోట్లు, పురపాలక శాఖ రూ.26 కోట్లు, సాధారణ పరిపాలన రూ.12కోట్లు, హోం శాఖ రూ. 27కోట్లు తదితర శాఖలు నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలపై జలమండలి మీనమేషాలు లెక్కిస్తుండడం గమనార్హం.