Hyderabad | సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): వారం రోజులుగా కురుస్తున్న వరుస వర్షాలతో నగరం చిత్తడిగా మారింది. ఉష్ణోగ్రతలు పడివడంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతునాన్నాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించడం సహజమే అయినప్పటికీ ముందస్తు చర్యలతో వాటిని నియంత్రించడం సంబంధిత ప్రభుత్వ శాఖల బాధ్యత. అయితే వర్షాలు కురుస్తున్నా అటు ఆరోగ్యశాఖ గాని ఇటు బల్దియా గాని సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై దృష్టిపెట్టకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు.
మొదలైన దోమల బెడద..
నాలుగైదు వర్షాలు కురిసాయో లేదో అప్పుడే దోమల బెడద రెట్టింపైంది. గ్రేటర్లోని చాలా ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వాస్తవానికి వర్షాకాలం ప్రారంభానికి ముందే జీహెచ్ఎంసీ అధికారులు యాంటీలార్వా, ఫాగింగ్ తదితర చర్యలు చేపట్టాలి.కానీ సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శలున్నాయి. దీనివల్ల దోమలు వృద్ధిచెంది సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.
అప్రమత్తంగా ఉండాలి: వైద్యులు
సాధారణంగా వర్షాకాలంలో ఫ్యాక్టరేబుల్ డిసీజెస్ (దోమకాటుతో వచ్చే వ్యాధులు), వాటర్ బాండరెబుల్ డిసీజెస్(నీటివల్ల వచ్చే వ్యాధులు) వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా వర్షాల వల్ల.. జలుబు, జ్వరం, దగ్గుతో పాటు వైరల్ ఫీవర్స్, ఫ్లూ వంటివే కాకుండా దోమకాటు వల్ల డెంగ్యు, మలేరియా, చికున్గున్య, కలుషిత ఆహారం, కలుషిత నీటి వల్ల.. డయేరియా, కామెర్లు, టైఫాయిడ్, హెపటైటిస్ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.