సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ 12 ద్విచక్రవాహనాలను సైబరాబాద్ షీటీమ్స్ పోలీసులకు అందచేసింది. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో అందచేసిన ఈ హోండా యాక్టివా వాహనాలను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, జాయింట్ సీపీ(ట్రాఫిక్) గజరావు భూపాల్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మహంతి మాట్లాడుతూ షీటీమ్ బృందాలు మహిళలు, చిన్నారుల భద్రత కోసం నిరంతరంగా పని చేస్తున్నాయని, బీజీఎల్ సంస్థ సీఎస్ఆర్ కింద అందచేసిన ఈ ద్విచక్ర వాహనాలతో షీటీమ్ బృందాలు మరిన్ని మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజీఎల్ సంస్థ ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.