“అది హిమాయత్‌నగర్‌లోని ఓ పైవేట్ స్కూల్. ఎల్కేజీలో తన కూతురిని చేర్పించడానికి ప్రకాశ్ అనే తండ్రి వెళ్లాడు. ఫీజు 95వేలు అంటూ యాజమాన్యం చెప్పింది. ఎల్కేజీకి అంత ఫీజు ఎందుకు ఉంటుందని అడిగితే.. మా స్కూల్లో ఫీజులు అంతే ఉంటాయి. మీకిష్టముంటే చేర్పించండి. మా స్కూల్లో అడ్మిషన్ల కోసం పోటీపడుతారు.” స్కూల్ యాజమాన్యం అలా చెప్పడంతో అవాక్కవడం ఆ తండ్రి వంతైంది. ఫీజుల ప్రక్రియలో ఓ విధానం లేకపోవడంతో ఆ తండ్రి ఏం చేయాలో తెలియక ఇంటికొచ్చేశాడు.
సిటీబ్యూరో, జూన్ 2 ( నమస్తే తెలంగాణ) : మరో పది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తల్లిదండ్రులకు పాఠశాలల నుంచి ఫోన్లు వస్తున్నాయి. “మీ పిల్లల ఫీజులు చెల్లించండి..యూనిఫాం, బుక్స్ వచ్చాయి. యాప్‌లు ఇన్స్టాల్ చేసుకోవాలి. డబ్బులు చెల్లించి వాటిని తీసుకొండి.’ అంటూ చెబుతున్నారు. అంతేకాదు ఫస్ట్ టర్మ్ ఫీజు స్కూల్ ప్రారంభం రోజునే చెల్లించాలని షరతులు విధిస్తున్నారు.
ఇక గతంలో ఫీజు బకాయిలు ఉన్న పేరేంట్స్‌కు మరో స్కూల్ చూసుకోండి అంటూ బెదిరిస్తున్నారు. చదువులు చెప్పే పాఠశాలలు ఇప్పుడు డబ్బులు వసూ లు చేసే వ్యాపార కేంద్రాలుగా మారాయంటూ విద్యార్థి సంఘా లు, పేరేంట్స్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే తరగతి చదువుకు సెక్షన్ల పేర్లు పెట్టి.. అదనపు సిలబస్‌లు బోధిస్తామంటూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల అంటే చదువుల తల్లి కొలువుండే ప్రదేశంగా అందరూ భావిస్తుంటారు. భావి భారత పౌరులను సన్మార్గంలో నడిచేల తీర్చిదిద్దే వేదికలు అవి. కానీ ఇప్పుడు నగరంలోని పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఎంత ఫీజు ఎక్కువగా ఉంటే అంత మంచి స్కూల్‌గా నిర్వచిస్తున్న పరిస్థితులు దాపురించాయి. రామ్‌నగర్‌లోని ఓ ప్రయివేట్ స్కూల్లో ఎల్కేజీకి రూ.35వేలు ఉండగా.. బంజారాహిల్స్‌లోని ఇదే ఎల్కేజీకి రూ. 1.20వేలు ఉంది. ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు ఏ స్కూలైన ఏడాది చదువుకు లక్ష రూపాయలకు పైగా తల్లిదండ్రులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థిథి ఉంది.
కనీసం నోటీసు బోర్డుపై ఏ క్లాస్‌కు ఎంత ఫీజు వసూలు చేస్తామో కూడా తెలపకుండా వారికి నచ్చినట్టుగా ఫీజులు వాళ్లే నిర్ణయించేస్తున్నారు. గ్రేటర్‌లోని పాఠశాలల్లో ఎల్కేజీకి వసూలు చేస్తున్న ఫీజులు.. ఇంజీనీరింగ్, మెడిసిన్, డెంటల్కాలేజీలు ఫీజుల కన్నా అధికంగా ఉన్నాయి. ఇంజినీరింగ్‌లో గరిష్టంగా అధికంగా రూ.2.15 లక్షల ఫీజు ఉంటే.. ఓ పాఠశాలలో ప్రీ ప్రైమరీకి రూ.2.10 లక్షలు వసూలు చేస్తున్నారు. ఫీజుల కట్టడిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎలాంటి నియంత్రణ ఉండకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
అంతర్జాతీయ ప్రమాణాలు అని చెప్పుకుంటున్న పాఠశాలల్లో ప్రమాణాలు సాధారణ పాఠశాలల మాదిరిగానే ఉంటున్నాయని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి వరకు 773 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. మరో 3,500 వరకు ప్రయివేట్ , కార్పొరేట్ పాఠశాలలున్నాయి. చాలా విద్యాసంస్థలు ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరుతో రాజ్యమేలుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా దర్జాగా బోర్డులు తగిలించుకొని దందా చేస్తున్నాయి.
సీఐఎస్(కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్) గుర్తింపు ఉన్న పాఠశాలలు మాత్రమే ఇంటర్నేషనల్ బోర్డులు తగిలించుకోవాలి. ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలను ఆ సంస్థ అన్ని విధాలుగా పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, బోధన సామగ్రిలాంటి 25 అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్స్ జారీ చేస్తుంది. కానీ నగరంలోని చాలా పాఠశాలలు గుర్తింపులేకున్నా ట్యాగ్ తగలించుకుంటున్నాయి. విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి ఫీజుల నియంత్రణ కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.