School Bus | దుండిగల్, సెప్టెంబర్ 13: పాఠశాల స్కూల్ బస్సు ఢీకొని ఎల్కేజీ విద్యార్థిని దుర్మరణం పాలైంది. దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కుంట రాజు, స్వప్నిక దంపతులు మల్లంపేటలోని డ్రీవ్ వ్యాలీ రోడ్డు పద్మజా రెసిడెన్సీలో నివాసముంటున్నారు. వీరి ఇద్దరు కుమార్తెలు స్థానిక ఓక్లీఫ్ హైస్కూల్లో చదువుతున్నారు.
శుక్రవారం ఉదయం ఎల్కేజీ చదువుతున్న చిన్న కుమార్తె మాన్విత(3) స్కూల్ బస్సు దిగి.. తరగతి గదికి వెళ్తున్న సమయంలో అదే బస్సు తగిలి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వైద్యశాలకు తరలించగా, పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.