సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్లచేతుల్లో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు మద్యం తాగి నడిపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలతో చెలగాటలాడమే అవుతుందని తల్లిదండ్రులు విద్యా సంస్థల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా విద్యా సంస్థలు చెలరేగిపోతున్నాయి. గ్రేటర్లో 13,502 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. హైదరాబాద్లో 1247, మేడ్చల్ మల్కాజిగిరిలో 6058, రంగారెడ్డిలో 6197 బస్సులు ఉన్నాయి.
వీరికి ఆర్టీఏ ప్రతి స్కూల్ ప్రారంభానికి ముందు రోడ్ సేఫ్టీ, డ్రైవర్ల నియామక సామర్థ్యం, ప్రమాదాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, బస్సు కండీషన్, ఆ బస్సుపై ఉండాల్సిన రంగులు, అక్షరాలు తదితర అన్నీ అంశాలపై సూచనలు ఇస్తారు. కానీ ఈ సారి ఆర్టీఏ అధికారులు వారికి సూచనలు చేసినప్పటికీ విద్యా సంస్థల నిర్వాహకులు తమదారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రోజు వారి కూలీగా డ్రైవర్లను నియమించుకుని ఎటువంటి అనుభవం లేకున్నా చేతికి స్కూల్ బస్సును ఇచ్చేస్తున్నారు. ఆ బస్సును నడపడానికి వాళ్లంతా మద్యం తాగి రోడ్డుపై ఉరికిస్తున్నారు. ఇలా పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు 3వేల విద్యా సంస్థల బస్సులు అసలు ఫిట్నెస్ పరీక్షకే రాలేదని అధికారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తుంది.