సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : స్కూల్ పిల్లలను తరలించే విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో కొందరు డ్రంకెన్ డ్రైవ్‌తో పట్టుబడగా.. ఇంకొందరూ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులను రోడ్డెక్కించారు. మద్యం మత్తులో ప్రమాదకర డ్రైవింగ్ చేసిన 18 మంది విద్యా సంస్థల బస్సుల డ్రైవర్ల లైసెన్స్ సస్పెండ్ చేయాలని ఆర్టీఏ అధికారులకు పోలీసుల నుంచి సిఫారసులు వచ్చాయి. రవాణా శాఖ అధికారులు వీరి లైసెన్స్ సస్పెన్షన్ ప్రక్రియలో భాగంగా వారికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.
హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో విద్యా సంస్థల బస్సు డ్రైవర్లు నిర్లక్షంగా డ్రైవింగ్ చేస్తూ మద్యం మత్తులో పోలీసులకు పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వారిని కట్టడి చేయడంలో భాగంగా వారి లైసెన్స్‌లను రద్దు చేయనున్నారు. గత రెండేండ్లలో 1415 మంది విద్యాసంస్థల బస్సులు, స్కూల్ ఆటో డ్రైవర్ల లైసెన్స్‌లు సస్పెండ్ అయ్యాయి.
ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు విద్యా సంస్థలకు ప్రత్యేక సూచనలు చేశారు. డ్రైవర్ల నియామకంలో ఆర్టీఏ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ఉల్లంఘిస్తే బస్సు సీజ్ చేయడంతో పాటు నిర్వాహులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిర్లక్షం కారణంగా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడొద్దని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కంటి పరీక్షలు, రోడ్డు నిబంధనలపై ఆర్టీఓ కార్యాలయాల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.