కవాడిగూడ, మే 28: పార్లమెంట్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగిసినందున ఎన్నికల కమిషన్ అనుమతితో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సడలింపు తీసుకొని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ, జాక్టో ప్రతినిధులతో కలిసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జరిపిన చర్చల్లో ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని షెడ్యూల్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ, నేటి వరకు ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నుంచి లేఖను పంపకపోవడం విచారకరమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి మంగళవారం పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు ఏర్పడిన న్యాయపరమైన ఆటంకాలన్నీ తొలిగిపోయినందున గత అక్టోబర్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పున:ప్రారంభించాలని కోరారు. గత అక్టోబర్లో బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్స్ అందరిని రిలీవ్ చేసి, నూతన పాఠశాలలకు పంపించాలని, గిరిజన సంక్షేమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను కూడా వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.