Scarlet fever | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సీజనల్ వ్యాధులతో పాటు స్కార్లెట్ జ్వరం కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నట్లు పిల్లల డాక్టర్లు పేర్కొంటున్నారు. ఐదేండ్ల నుంచి 15 ఏండ్ల పిల్లలు ఈ జ్వరం బారిన పడుతున్నారని, ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
గొంతునొప్పి, తీవ్రజ్వరం, దద్దుర్లు .. ఉన్నాయంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. గత కొద్ది రోజుల నుంచి స్ట్రెప్టోకొక్కై అనే బ్యాక్టీరియాతో ముడిపడిన ఈ ఇన్ఫెక్షన్ను ఎక్కువగా చూస్తున్నామని తెలిపారు. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే జ్వరాన్నే స్కార్లెట్ ఫీవర్ అని పిలుస్తారు. తీవ్ర జ్వరం, నోరు పొక్కిపోవడం, గొంతులో మంట, నాలుక ఎర్రగా కందిపోవడం (స్ట్రాబెర్రీ టంగ్), నీరసం, ఏమీ తినాలనిపించకపోవడం వంటివి వ్యాధి లక్షణాలు అని వైద్యులు పేర్కొన్నారు.
ఈ వ్యాధి లక్షణాలు రెండు నుంచి ఐదు రోజుల్లో బయటపడుతాయని డాక్టర్లు తెలిపారు. తీవ్ర జ్వరం, నోరు పొక్కిపోవడం, గొంతులో మంట, నాలుక ఎర్రగా కందిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. సరైన సమయంలో మంచి యాంటీ బయాటిక్ వాడితే ప్రమాదకరం కాదు. సరైన మెడిసిన్స్ తీసుకోకపోతే కొంతమందిలో గుండె, కిడ్నీల మీద ప్రభావం పడవచ్చు. రుమాటిక్ ఫీవర్, నెఫ్రైటిక్ సిండ్రోమ్లకు కూడా దారి తీయొచ్చు.
ఈ జ్వరం తర్వాత బిడ్డలో ఆయాసం, గుండెదడ, ముఖం వాచిపోవడం, మూత్రం తగ్గిపోవడం, మూత్రంలో రక్తం.. మొదలైన లక్షణాలను గమనిస్తూ ఉండాలి. తేడాగా అనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలి. చాలా వైరల్ ఇన్ఫెక్షన్లలో.. డెంగ్యూతో పాటు దద్దుర్లు వస్తాయి. ఇలాంటప్పుడు, తప్పక పిల్లల డాక్టర్ను సంప్రదించాలి. అది ఏ తరహా జ్వరమో నిర్ధారించుకొని మంచి చికిత్స ఇప్పించాలి. నిర్లక్ష్యం పనికిరాదు.
స్కార్లెట్ ఫీవర్ అనేది అంటువ్యాధి. ఈ జ్వరంతో బాధపడేవారు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మరొకరికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆహారం, నీరు, ఇతర పదార్థాలను తీసుకోకూడదు. ముక్కు, నోరు కవరయ్యేలా మాస్కు ధరించడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Bhuvanagiri | భువనగిరిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల దాష్టీకం
Hyderabad | మణికొండలో కారు బీభత్సం.. మహిళకు తీవ్ర గాయాలు