ఖైరతాబాద్, ఏప్రిల్ 12 : స్త్రీలతో సమానంగా మగవారికి కూడా రక్షణ చట్టాలు చేయాలని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ప్రతినిధి కృష్ణా రావు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మగవారిపై ఏకపక్షంగా నమోదవుతున్న కేసులపై అవేదన వ్యక్తంచేశారు. సమాజంలో మగవారు వివాహానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుంటే వారి పక్షాన ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య ఇందిరాపార్కులో సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన ఇచ ఎప్పారు. వైవాహిక జీవితంలో మగవారు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి పక్షాన నిలబడుతామని తెలిపారు.
ఆధునిక యుగంలో మగవారు పడే బాధలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఈ నెల 19న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘సత్యగ్రహ ఫర్ మెన్’ పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కృష్ణారావు తెలిపారు. మూడు ప్రధానమైన డిమాండ్లతో పోరాడుతున్నామని, అందులో పురుషులకు జాతీయ కమిషన్, న్యూట్రల్ జెండర్లాస్, తప్పుడు కేసులు పెట్టిన వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్లో మగవారి కేసులు తీసుకోవడం లేదని, మహిళలకు సంబంధించినవి వెంటనే తీసుకుంటున్నారని, ఈ వివక్షత చాలా కాలంగా కొనసాగుతుందని చెప్పారు.
498 కేసు నమోదైతే ఇంటికి వెళ్లి విచారణ చేయాలని, పోలీసు స్టేషన్లో కూర్చోని సాక్షులను విచారిస్తే సరిపోదని కృష్ణారావు అన్నారు. ఒక వేళ తప్పు చేసినట్లు నిర్ధరణ జరిగితేనే కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఇంట్లో వారిని, చివరికి విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ఆడపిల్లలపై కేసులు పెట్టడం వల్ల వారికి వివాహాలు జరగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే అన్ని రంగాల్లో సమాన హక్కులు అడగడాన్ని తప్పుపట్టడం లేదని, అయితే విద్యాధికులై సంపాదిస్తున్న ఉన్న వారికి డైవర్స్ తర్వాత మెయింటెనెన్స్ అడగడం సరికాదన్నారు. మగవారికి సైతం ప్రత్యేక సెక్షన్ తీసుకురావాలన్నారు.