సిటీబ్యూరో, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : మూసీ నది పునరుజ్జీవం పేరిట ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పర్యావరణ ప్రేమికులు, నిపుణులు, ప్రజాసంఘాల నాయకులు గళమెత్తుతున్నారు. పీపుల్స్ కమిటీ ఫర్ మూసీ రివర్ రిజువనేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నాచౌక్లో సత్యాగ్రహం నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సాగే ఈ నిరసనలో పలువురు మేధావులు, సామాజికకార్యకర్తలు పాల్గొంటారని, మూసీ మనుగడకు నిర్మాణాత్మకమైన విధివిధానాలపై చర్చిస్తారని పీపుల్స్ కమిటీ ప్రతినిధి లుబ్నా సార్వత్ తెలిపారు. మూసీ నది ప్రక్షాళన అనేది కేవలం సుందీరకణ ప్రాజెక్టుగా మిగిలిపోకూడదని, అది నదీ పరీవాహక ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడేదిగా ఉండాలని కమిటీ డిమాండ్ చేస్తోంది. దేశీయ పరిజ్ఞానంతో, పునర్జీవ పనులు చేపట్టాలని కోరుతుంది. నది సహజత్వాన్ని దెబ్బతీసే విధానాలపై పోరాటం చేస్తామని చెబుతోంది.
ఈ క్రమంలో పర్యావరణ, సామాజిక, సాంస్కృతిక, రివర్ మేనేజ్మెంట్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో పనిచేసిన నిపుణులతో ఏర్పాటైన ఈ పీపుల్స్ కమిటీ పలు అభ్యంతరాలను కూడా సర్కారుకు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నమూనా శాస్త్రీయంగా లేదని, రియల్ ఎస్టేట్ కోణంలోనే ఆలోచిస్తున్నారని నిపుణులు విమర్శిస్తున్నారు. నది ప్రవాహాన్ని, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే హైడ్రోలాజికల్ విధానమే లేదన్నారు.
భారీ బడ్జెట్తో కాకుండా, తక్కువ వ్యయంతోనూ పర్యావరణహితమైన పునర్జీవన పద్ధతులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూసీ నదికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత, వారసత్వ కట్టడాలను కాపాడుతూనే అభివృద్ధి చేయాలంటున్నారు. కాంక్రీట్ కట్టడాల కంటే నది జీవవైవిధ్యాన్ని కాపాడటంపైనే సర్కారు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
ఈ క్రమంలో నదిపై ఆధారపడి ఉన్నామని, మూసీ నది మనుగడ భావితరాలకు అవసరమనే సామాజిక స్పృహతో ప్రతి ఒక్క నగరపౌరులు సత్యాగ్రహంలో భాగస్వాములు కావాలని పీపుల్స్ కమిటీ పిలుపునిచ్చింది. గాంధేయ మార్గంలో శాంతియుతంగా సాగే ఈ ఆందోళన ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలగించేలా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మూసీ నదిని మురుగు కూపం నుంచి విముక్తి చేసి, పూర్వ వైభవాన్ని తీసుకు రావడానికి కాంక్రీట్ గోడలు సరిపోవని, నది పరీవాహక ప్రాంత సమగ్ర అభివృద్ధి అత్యంత కీలకమని పీపుల్స్ కమిటీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.