మన్సూరాబాద్, జనవరి 4: బంగారం షాపుల్లో సేల్స్మెన్ల దృష్టి మరల్చి ఆభరణాలను అపహరిస్తున్న కేసులో మహిళను సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ. 12 లక్షల విలువైన 190 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సాయిశ్రీ వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల, సంజీవయ్యకాలనీకి చెందిన కొంగలి నరేందర్, గోనెల గౌతమి భార్యాభర్తలు. నరేందర్ ఫిల్మ్ ఆర్టిస్ట్, గౌతమి వ్యవసాయ కూలి. సంవత్సరం క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, భూపేశ్గుప్తనగర్, జనార్దన్‌కాలనీలో నివాస ముంటున్నారు.
భర్త సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో దొంగతనాలకు పాల్పడాలని గౌతమి నిర్ణయించుకుంది. బంగారం షాపుల్లో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని షాపుల్లోకి వెళ్లి బంగారు చైన్లను చూపించాలని అడుగుతూ చైన్లు ఉన్న ట్రే ముందు పెట్టగానే.. షోకేజ్‌లో ఉన్న మరో చైన్‌ను తీసి చూపించాలని కోరుతుంది. సేల్స్‌మెన్ అటువైపుగా తిరిగి షోకేజ్‌లో ఉన్న ట్రే తీస్తుండగానే ముందు ఉన్న ట్రేలోని బంగారు చైన్‌ను తీసుకుని దాని స్థానంలో రోల్డ్‌గోల్డ్ చైన్‌ను పెట్టి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
కాగా దిల్సుఖ్నగర్, కమలానగర్‌లోని లలితా జువెల్లరీ షాపులోకి గత నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లి 24 గ్రాముల బంగారు చైన్‌ను అపహరించింది. నిందితురాలు వెళ్లి పోయిన తరువాత ట్రేలో ఉన్నది రోల్డ్‌గోల్డ్ చైన్‌గా సేల్స్‌మెన్ గుర్తించి విషయాన్ని మేనేజర్‌కు తెలిపారు.దీంతో వారు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని పోలీసులు గుర్తించి గురువారం కర్మన్‌ఘాట్‌లో గౌతమని అరెస్ట్ చేశారు. కాగా ఆమె జూబ్లీహిల్స్ పీఎస్, మహంకాళి పీఎస్, చైతన్యపురి పీస్, కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిల్లోను దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. నిందితురాలు గౌతమిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వర్రావు, సరూర్‌నగర్ సీఐ శ్రీనివాస్, డీఐ యాదగిరి, డీఎస్ఐ సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.