తెలుగుయూనివర్సిటీ, ఫిబ్రవరి 8: తెలుగు భాషపై అభిమానాన్ని పెపొందించి, సాహిత్య రంగానికి కొత్త తరాన్ని తయారు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాలసాహిత్య కార్యశాలలు నిర్వహించాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం దేవులపల్లి రామానుజరావు కళా మందిరంలో పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే మాతృభాషాభిమానాన్ని, సృజనాత్మక రచనాభిరుచిని కలిగించాలని అన్నారు.
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా శాంతా వసంత ట్రస్టు సౌజన్యంతో నవంబర్, మే నెలల్లో జరుపుతున్న బాల సాహిత్య కార్యక్రమాలకు తోడు ఇప్పుడు అట్టడుగు స్థాయి నుంచి విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు.బాల సాహిత్యమే భావి సాహిత్యం అనే నినాదంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య స్వాగతోపన్యాసంలో తెలిపారు. తెలంగాణ పలు జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 35 మంది తెలుగు ఉపాధ్యాయులు,బాల సాహితీవేత్తలు చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీతలు డాక్టర్ దాసరి వెంకటరమణ, వెంకటరమణ, బాల సాహితీవేత్తలు అశోక్, డాక్టర్ వీఆర్ శర్మ, డాక్టర్ నీరజ, పరిషత్తు కార్యక్రమ సలహాదారు రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.