GHMC | సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ) : మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా..అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6530కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి రూ. కోటికి పైగా చెల్లింపులు జరుపుతున్నారు. ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే చాలు జీతభత్యాలు, పెన్షన్లు చెల్లించేందుకు ఆర్థిక విభాగం నానా తంటాలు పడుతున్నది. ఈ నేపథ్యంలోనే పారిశుధ్య నిర్వహణను ప్రైవేట్‌పరం చేసి మరింత భారం మోపేందుకు శానిటేషన్ విభాగం రంగం సిద్ధం చేసింది.
పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీ/వీఐపీలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల పారిశుధ్య నిర్వహణను 73 కిలోమీటర్ల మేర రహదారులను అప్పగించారు. 24 గంటలూ స్వీపింగ్ జరిగేలా మెక్లిన్, ఇక్సోరా కంపెనీలకు ఈ బాధ్యత అప్పగించారు. ఇందుకుగానూ కిలోమీటర్‌కు సగటున నెలకు రూ.3.12 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వాస్తవంగా ఇదే పనిని కార్మికుల స్వీపింగ్‌కు నెలకు అయ్యే వ్యయం రూ.40వేలు మాత్రమే. కార్మికులతో పోలిస్తే ప్రైవేట్‌కు చెల్లిస్తున్నది ఎనిమిది రేట్లు అధికం. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేట్ విధానంపై తీవ్ర స్థాయిలో అరోపణలు వస్తుండగా, తాజాగా అధికారులు మరో 64.40 కిలోమీటర్ల మేర కారిడార్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు.
ఇదే జరిగితే సంస్థపై నెలకు రూ. 2 కోట్ల చొప్పున ఏటా రూ. 24కోట్ల ఆర్థిక భారం పడనున్నది. గతంలోనే అప్పగించిన రోడ్లకు ప్రస్తుతం ఏటా రూ. 22.46 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఈ మొత్తం రూ. 47 కోట్లకు పెరగనున్నది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సంస్థకు ఈ నిర్ణయం మరింత అదనపు భారమే అని చెప్పాలి.
వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు
Ghmc
దేశ, విదేశీ సందర్శకులు రానున్న దృష్ట్యా పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, వీవీఐపీలు, వీఐపీలు రాకపోకలు సాగించే మార్గాల్లో చెత్తా చెదారం కనిపించవద్దని 24 గంటల స్వీపింగ్‌కు ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. 27 టూరిస్ట్ ప్రాంతాలు, 73 కిలోమీటర్ల మేరలోని చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాలను ఇక్సోరా కార్పొరేట్ సర్వీస్ ప్రై.లి శానిటేషన్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సదరు ఏజెన్సీ గడిచిన కొన్నేండ్లుగా ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ బాధ్యతలను చేపడుతున్నది. రోజుకు మూడు సార్లు స్విపింగ్ (చెత్త ఊడవడం నుంచి ఎత్తివేసే ప్రక్రియ వరకు), ప్రత్యేక సిబ్బంది, సూపరవైజర్లతో కలిసి శానిటేషన్ నిర్వహిస్తున్నారు. తాజాగా, సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్ జోన్లలోని 64.40 కిలోమీటర్ల పరిధిలోని కారిడార్లను ఏజెన్సీలను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల తాజా నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కార్మికుల పొట్ట కొట్టే విధానాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి.