Hyderabad | బంజారాహిల్స్, జూలై 13: వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో చెత్త తొలగింపులోజీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నూర్‌నగర్, ఇబ్రహీంనగర్, గురుబ్రహ్మనగర్ బస్తీల్లో చెత్తను 3 నుంచి 5 రోజులకు ఒకసారే తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గురుబ్రహ్మనగర్‌లో ప్రధాన రోడ్డు పక్కన చెత్తను కుప్పలుగా వేస్తున్నారు. ఇండ్లనుంచి తీసుకువచ్చిన చెత్తను ఇక్కడ గుట్టలుగా వేస్తున్న బల్దియా అవుట్సోర్సింగ్ సిబ్బంది దానిలోంచి స్క్రాప్‌ను వేరు చేసి పక్కకు పెట్టుకుంటున్నారు. అవసరమైన వస్తువులను తీసుకువెళ్లిన తర్వాత చెత్తను డంపింగ్ యార్డ్‌కు తరలించకుండా అక్కడే వదిలిపెట్టడంతో దారిన వెళ్లేవారు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి ఈ ప్రాంతాల్లో చెత్తను ప్రతిరోజూ తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.