సిటీబ్యూరో/బంజారాహిల్స్, ఏప్రిల్ 8: మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యక్తిగత పరిశుభ్రతపై బాలికలు మరింత శ్రద్ధ పెట్టాలని, పీరియడ్స్ అనేవి అత్యంత సహజసిద్ధమైన ప్రక్రియ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఫిక్కీలేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో ‘సస్టెయిన్ హర్ హెల్త్’ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నం 12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మెషిన్తోపాటు ఇన్సినేటర్ను మేయర్ ప్రారంభించారు. బాలికలకు శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడడం ఏమాత్రం తప్పుకాదని, ఈ విషయాన్ని గురించి మాట్లాడేందుకు సిగ్గుపడాల్సిన పనిలేదన్నారు. సరైన అవగాహన లేకపోవడంతో పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతలో లోపాలు ఏర్పడతాయని, తద్వారా అనేక ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందన్నారు. పీరియడ్స్ నిర్వహణలో పాతపద్ధతులకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్వో చైర్ పర్సన్ రీతాషా, డా.శ్వేత అగర్వాల్, కనికా జైన్, హెడ్మాస్టర్ అనిత పాల్గొన్నారు.