సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి పేలుళ్ల ఘటనలో తీవ్ర గాయాలకు గురైన ముగ్గురికి హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు దవాఖాన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా.ఎం.రవి కిరణ్ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్‌లో పేర్కొన్నారు. సంగారెడ్డి ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని హైటెక్ సిటీలోని యశోద దవాఖానకు తరలించారని, ఈ క్రమంలో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 34 ఏండ్ల వ్యక్తికి ఛాతి, కాళ్లు.. తదితర భాగాల్లో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయని, సదరు వ్యక్తికి శస్త్ర చికిత్స జరిపి, పేలుడుతో శరీరంలోకి వెళ్లిన పదునైన పదార్థాలను తొలగించినట్లు వివరించారు.
ప్రస్తుతం అతడికి వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు బులిటిన్‌లో వెల్లడించారు. 37 ఏండ్ల మరో వ్యక్తికి సైతం కాలిన గాయాలు ఉన్నాయని, మెదడుకు సైతం గాయమైనట్లు తెలిపారు. అంతేకాకుండా.. ముఖంపై గ్రేడ్-3 మేరకు, శరీర పైభాగంలో పలు చోట్ల కాలిన గాయాలైనట్లు వివరించారు. ఇతడికి కూడా వెంటిలెటర్‌పై న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని, ఇతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. 24 ఏండ్లున్న మరో వ్యక్తికి సైతం పలు చోట్ల కాలిన గాయాలు ఉండటంతో ఐసీయూ అబ్జర్వేషన్లో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇతడి పరిస్థితి సైతం నిలకడగానే ఉన్నట్లు హెల్త్ బులిటిన్‌లో వెల్లడించారు.