Sandhya Theatre | తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం సమాధానమిచ్చింది. ఆరు పేజీల లేఖను పోలీసులకు పంపించింది. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై స్పందించింది. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపింది. గత 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నామని.. కానీ ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొంది. గతంలో పలు సినిమాల విడుదల సమయంలోనూ చాలామంది హీరోలు థియేటర్‌కు వచ్చిన విషయాన్ని గుర్తు చేసింది.
పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపింది. ఈ నెల 4, 5వ తేదీల్లో థియేటర్ నిర్వహణను మైత్రీ మూవీస్ తీసుకుందని పేర్కొంది. తమ థియేటర్లో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్ ఉందని వివరించింది.