Hyderabad | అమీర్‌పేట్, ఫిబ్రవరి 13 : పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సనత్ నగర్ రౌండ్ టేబుల్ స్కూల్లో మౌలిక వసతులు పెరగడం లేదు. దీంతో ఒకే తరగతి గదిలో వేర్వేరు తరగతుల చిన్నారులకు బోధన జరుగుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి రౌండ్ టేబుల్ స్కూల్‌కు సమీపంలో ఖాళీగా ఉన్న టిఆర్టి క్వార్టర్స్‌ను విద్యార్థుల వినియోగంలోకి తేవాలన్న ఆలోచన మేరకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
దీంతో కొద్ది నెలలుగా ఖాళీగా ఉన్న ఈ క్వార్టర్ విద్యార్థుల తరగతుల కోసం వినియోగించేందుకు వీలుగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మేరకు ఈ అంశాన్ని సనత్ నగర్ పారిశ్రామికవాడలోని సిప్రా ల్యాబ్స్ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చక్కటి నిర్మాణాలు చేపడుతున్న సిప్రా ల్యాబ్స్ యాజమాన్య ప్రతినిధులు ఇక్కడి పురాతన భవంతికి అవసరమైన మరమ్మతులు చేపట్టి విద్యార్థుల తరగతి గదులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ మేరకు దాతలు జెక్ కాలనీకి చెందిన సిప్రా సంస్థ యాజమాన్య ప్రతినిధి శ్రీహరితో కలిసి కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి కొత్తగా తీర్చిదిద్దిన అదనపు తరగతి గదులను గురువారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అడిగిన వెంటనే చేయూతనందిస్తున్న సిప్రా ల్యాబ్ యాజమాన్యం మరోసారి తన ఉదారతను చాటుకుందన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత రౌండ్ టేబుల్ పాఠశాలకు పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు దీటుగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ నూతన భవంతుని అదనపు అంతస్తులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు.