ఎర్రగడ్డ/జూబ్లీహిల్స్, ఆగస్టు24: హామీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్‌పార్టీ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడిగేందుకు వస్తే నిలదీయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను కోరారు. ఆదివారం సాయంత్రం ఎర్రగడ్డలోని మెజెస్టిక్ గార్డెన్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాపసభను నిర్వహించారు. ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ ఇన్చార్జి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో తలసాని మాట్లాడుతూ..
నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉన్న ప్రజానాయకుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. మూడుసార్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాగంటి.. తనకు ఎంతో సన్నిహితుడని, ఆయన మృతి నియోజకవర్గప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సైతం తీరని లోటన్నారు.
మాగంటి ఆకస్మిక మరణంతో త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహించనున్నారని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కట్టి మాగంటికి ఘన నివాళి అర్పిద్దామన్నారు. అలాగే సర్దార్ లాంటి బీఆర్ఎస్ కార్యకర్తల మృతికి కారణమైన కాంగ్రెస్ పార్టీపై ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని నియోజకవర్గం ప్రజలంతా సిద్దమవుతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ మొత్తం అండగా నిలుస్తుందన్నారు.
420 హామీలు ఇచ్చి అధికారంలోకి..
ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని దివాళా తీయించిందని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 14ఏళ్లపాటు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ నాయకత్వంతో పదేళ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేద ముస్లింలకు ఎన్నో పథకాలు వచ్చాయని, 20నెలల కాంగ్రెస్పాలనతో ఎక్కువగా మోసపోయింది ముస్లింలే అని మహమూద్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం ద్వారా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రుణం తీర్చుకోవాలని కార్యకర్తలను కోరారు.
నమ్మినవారిని మోసం చేసే పార్టీ..
మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మిన వారిని మోసం చేసే పార్టీ అని, పార్టీలోనే పుట్టిన తమలాంటి వారికే అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ చిన్నచిన్న కార్యకర్తలకు న్యాయం చేస్తుందని నమ్మవద్దని సూచించారు. ఎమ్మెల్యేగా గోపీనాథ్ చేసిన అభివృద్దిని, సీఎంగా కేసీఆర్ అందించిన సంక్షేమాన్ని గుర్తు పెట్టుకుని రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్, బీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్రనేతలు అర్షద్, సోహైల్, కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్, ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ్, ప్రధాన కార్యదర్శి షరీఫ్ ఖురేషీ, కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్పొరేటర్లు తబియా గౌసిద్దీన్, ముద్దం నర్సింహయాదవ్, మహేశ్వరి శ్రీహరి, శిరీషబాబూరావు, ఆవుల రవీందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
బుద్దిచెప్పే సమయం ఆసన్నమైంది..
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న మాగంటి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్లో గోపినాథ్ సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ప్రజాసేవే పరమావధిగా.. కార్యకర్తలే పంచ ప్రాణాలుగా.. పేద ప్రజలే తన కుటుంబంగా అసలు సిసలైన ప్రజా నాయకుడిగా మాగంటి గోపినాథ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలంటే ఇంకా 40 నెలలు ఆగాలని.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఇప్పుడే ఆ అవకాశం వచ్చిందని.. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి మాగంటి రుణం తీర్చుకుందామన్నారు. ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరవేద్దామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, మాగంటి సతీమణి మాగంటి సునీత, ఎమ్మెల్సీ.. డివిజన్ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్ రెడ్డి, వినయ్ బాస్కర్, కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్, వెల్దండ వెంకటేష్, రహ్మత్‌నగర్ మాజీ కార్పొరేటర్ షఫీ, మైనార్టీ నేత సొహైల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.