చిక్కడపల్లి, ఫిబ్రవరి 19: బాగ్‌లింగంపల్లిలోని చిరువ్యాపారులపై జీహెచ్ఎంసీ, హైడ్రా బుల్డోజర్లు దూసుకుపోయాయి. రోడ్డు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను తొలగించారు. బాగ్‌లింగంపల్లి ప్రధాన రోడ్డు, సుందరయ్య పార్క్, అంబేద్కర్ కళాశాల సమీపంలో, సాయిబాబా దేవాలయం తదితర ప్రాంతాల్లో నిర్మాణాలను సిబ్బంది తొలగించారు.హౌసింగ్ బోర్డుకు సంబంధించిన భవనాల్లో పార్కింగ్ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను కూడా తొలగించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ దుకాణాలను కూల్చివేశారని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం డబ్బాల్లోని సామాన్లు కూడా తీసుకునే సమయం ఇవ్వలేదని కన్నీటి పర్యంతమయ్యారు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ సాయి బాబా, చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ మల్లేశం, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు పర్యవేక్షణలో షెడ్ల, దుకాణాల తొలగింపు పనులు చేపట్టారు.
నిరుపేదల పొట్టకొట్టారు
సుందరయ్య పార్కు వద్ద ఫుట్‌పాత్‌పై దుకాణిలను అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై డీవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ తప్పుపట్టారు. కూల్చివేతల విషయంలో బల్దియా, హైడ్రా చూపిస్తున్న ఉత్సాహం ప్రజలకు సేవలను చేరువ చేయడంలో కూడా చూపించాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల పొట్ట కొట్టే చర్యలను ఇప్పటికైనా అధికారులు మానుకోవాలని హితవు పలికారు.