Talasani Srinivas Yadav | అమీర్‌పేట, ఏప్రిల్ 13: అగ్ని ప్రమాదాల మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో ఫైర్ ఫైటర్లుగా పిలిచే అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి చేసే కృషి మరువలేనిది అని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20 వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సీహెచ్ పూర్ణ కుమార్, లీడింగ్ ఫైర్‌మ్యాన్ ఎనుపోతుల రాజు, ఫైర్ ఫైటర్లు అర్జున్, ఎంజే ప్రసాద్, కే రాజశేఖర్‌లతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 1944 ఏప్రిల్ 14 ముంబై డాకుయార్డ్ లో సంభవించిన అగ్ని ప్రమా ప్రమాదాన్ని నియంత్రించడంలో అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలకు మించి చేసిన పోరాటం నిలిచిపోతుందని అన్నారు. వేలాది మందిని కాపాడే ప్రయత్నంలో 800 మంది ప్రజలతో పాటు 66 మంది ఫైర్ ఫైటర్లను తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన ఘటనను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏటా అగ్నిమాపక శాఖ జరుపుకునే వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని అన్నారు.