Type-1 Diabetes | సిటీబ్యూరో, ఏప్రిల్ 30, (నమస్తే తెలంగాణ): టైప్-1 మధుమేహం బారిన పడిన చిన్నారులకు భరోసా లభించనుంది. ప్రభుత్వమే ఉచితంగా ఇన్సులిన్, అధునాతన వైద్య సేవలందించనుంది. టైప్-1 మధుమేహం చికిత్సలకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 14 ఆసుపత్రులను కేంద్రం ఎంపిక చేసింది. హైదరాబాద్‌లోని గాంధీ జనరల్ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రులు ఉండటం విశేషం. తెలంగాణలో 2022లోనే చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్ సర్కార్ గాంధీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు పునాదులు వేసింది.
గాంధీ ఆసుపత్రికి ఇప్పటివరకు టైప్-1 మధుమేహంతో బాధపడుతూ 550 నుంచి 600 మంది చిన్నారులు వైద్యులను సంప్రదించారు. 2012లో ఓ స్వచ్ఛంద సంస్థ బాధితులను గుర్తించి వారికి చికిత్సనందించడం మొదలుపెట్టారు. ఈ క్రమంగా సంఖ్య పెరగడం మూలంగా కేసీఆర్ సర్కార్ దృష్టి సారించింది. 2022లో తొలిసారిగా గాంధీ ఆసుపత్రిలో ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించింది. ఉస్మానియాలో సైతం టైప్-2 డయాబెటిక్ బాధితుల కోసం హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహకారంతో డయాబెటిక్ ఫూట్ కేర్ క్లినిక్ ను ఏర్పాటు చేసింది. డయాబెటిక్ రోగులకు వైద్య సేవలందించడంలో బీఆర్ఎస్ సర్కార్ ఎంతో కృషి చేసింది. నాడు ప్రారంభించిన సేవల ఫలితమే నేడు గాంధీ, ఉస్మానియాలను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా కేంద్రం ప్రకటించింది.
2 ఏండ్ల నుంచి 25 ఏండ్ల లోపు వయస్సు ఉన్నవారందరూ టైప్-1 మధుమేహంతో బాధపడుతున్నారు. ఆటో ఇమ్యునో డిసీజ్ ద్వారా వ్యాపించి, శరీరంలోని ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. దీంతో కచ్చితంగా ఇన్సులిన్ అవసరమేర్పడుతుంది. సరిగ్గా తినకపోవడం, నిద్రలేకపోవడం, చికాగుగా ఉంటడం వంటి లక్షణాలు వారిలో కనిపిస్తుంటాయి. రోగం 60 శాతానికి పైగా వ్యాపించిన తరువాతనే వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇతర ఆసుపత్రుల్లోనైతే నెలకు రూ 4 వేలు పెట్టి మరీ ఇన్సులిన్‌ను కొనుగోలు చేసుకుంటున్న పరిస్థితి బాధితులకు ఎదురవగా, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వల్ల రూపాయి ఖర్చులేకుండా పూర్తిస్థాయిలో ఉచితంగానే ఇన్సులిన్లు ఇస్తూ, అధునాతన వైద్య సేవలందించనున్నారు. డయాబెటిస్ వచ్చిన పిల్లలను పరీక్షించడంతో పాటు అనుమానాల నివృత్తి కోసం వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములకు పరీక్షలు నిర్వహిస్తారు.
టైప్-1 డయాబెటిక్ లక్షణాలు తమ పిల్లల్లో కనిపిస్తే తల్లిదండ్రులు గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి. నియంత్రణలో భాగంగా దానిపై అవగాహన అత్యంత అవసరం. గాంధీలో అధునాతన పద్ధతుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా పరిశోధనలు చేసి టైప్-1 నియంత్రణకు కృషి చేస్తున్నాం.
– డాక్టర్ విజయశేఖర్ రెడ్డి, ఎండోక్రైనాలజీ హెచ్ఓడీ గాంధీ ఆసుపత్రి