సిటీబ్యూరో, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) : బీహార్ కేంద్రంగా నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 4.957 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల వద్ద పెద్దఎత్తున విద్యార్థులకు మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను సదరు పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు పట్టించడం, ఆ తరువాత పలుచోట్ల ఈ మత్తు చాక్లెట్ల విక్రయదారులు వేర్వేరు ఘటనల్లో పోలీసులు, అబ్కారీ అధికారులకు పట్టుబడిన ఘటనలతో కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన ఈ మత్తు చాక్లెట్ల విక్రయాలు మళ్లీ మొదలయ్యాయి.
ఎస్టీఎఫ్ సీఐ సుభాష్‌చందర్ కథనం ప్రకారం… బీహార్‌కు చెందిన వీరేంద్ర పండరీ స్వరాష్ట్రం నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకువచ్చి బోడుప్పల్‌లోని గౌతంనగర్ మురికివాడలో కూలీ పనులు చేసేవారికి రూ.15కు ఒక చాక్లెట్ చొప్పున విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 4.957కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకున్న వారిలో ఎస్ఐలు అఖిల్, వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు సుధాకర్, రవి, కిషన్‌రావు, సుధీశ్ శ్రీనివాసులు ఉన్నారు.