సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): మరో 6 రోజుల్లో బడి గంట మోగనున్నది. ఇప్పటికే నగరంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ ఏడాది విద్యా సంవత్సరానికి అవసరమయ్యే పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు తీసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలు పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం తదితర సామగ్రి అంతా తమ స్కూళ్లోనే తీసుకోవాలని షరతులు పెడుతున్నాయి. స్కూళ్లోనే ప్రత్యేక కౌంటర్లు తెరిచి వాటికి ఇష్టానుసార ధరలు వేసి విక్రయిస్తున్నారు.
ఎల్కేజీ పుస్తకాలు, యూనిఫాంకు రూ. 6వేలు, మిగిలిన తరగతులకు 13 వేల రూపాయల వరకు పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. స్కూల్ ఫీజులతో పాటు అదనంగా పుస్తకాల పేరుతో డబ్బులు దండుకోవడంపై కొందరు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా.. ఫలితం ఉండటం లేదు. సాధారణంగా ప్రతీ మండలానికి సంబంధించి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బాధ్యత వహిస్తారు. వారి పరిధిలోని పాఠశాలలపై దృష్టిసారించాల్సి ఉంటుంది.
పాఠశాలల్లో డీఈఓ అనుమతితో ఆకస్మిక తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలి. కానీ వారి పరిధిలో చాలా పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నప్పటికీ చోద్యం చూస్తున్నారు. పాఠశాలల నుంచి వస్తున్న మామూళ్లు తీసుకుంటున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఒక్కో పాఠశాల నుంచి నెలకు ఇంత డబ్బు అంటూ లెక్కలు ఉంటాయని ఆరోపిస్తున్నారు. అందుకే పాఠశాలలు సైతం విద్యా శాఖ అధికారులను లెక్క చేయరని.. చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.