సిటీబ్యూరో/జుబ్లీహిల్స్, జూన్10 (నమస్తే తెలంగాణ): బస్తీవాసులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్యసేవలందించే బస్తీ దవాఖానలు కాంగ్రెస్‌పాలనలో నిర్వీర్యమయ్యాయి. నాణ్యమైన వైద్యసేవలందించడంలో విఫలమవ్వగా, పనిచేసే సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలుగా పెండింగ్ వేతనాలు ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీదవాఖానలు ఉండగా, గ్రేటర్ పరిధిలోనే 300 బస్తీ దవాఖానలు పేద ప్రజలకు వైద్య సేవలందిస్తున్నాయి.
ప్రతి బస్తీ దవాఖానలో మెడికల్ అధికారి, స్టాఫ్ నర్సు, సపోర్టింగ్ స్టాఫ్‌తో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా 1300కు పైగా వైద్యసిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా వేతనాలు రాక కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. పేద ప్రజల చెంతకు వైద్యమందించాలని నాటి బీఆర్ఎస్ సర్కార్ పట్టణాల్లో బస్తీదవాఖానలు ఏర్పాటు చేసింది.
కేసీఆర్ అధికారంలో ఉన్న రోజుల్లో వాటిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేది. సిబ్బంది వేతనాలు, కావాల్సిన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేవి. కాంగ్రెస్ పదిహేను నెలల పాలనలో వైద్యరంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. గ్రేటర్లో ఉన్న బస్తీ దవాఖానల్లో ప్రస్తుతం సరిపడా మందులు లేక, ప్రైవేట్ ఫార్మసీలను ఆశ్రయిస్తున్న తరుణం ఏర్పడింది. సిబ్బందికి వేతనాలు వేయమంటే ఖాజానా ఖాళీ అయిందంటూ తప్పించుకు తిరుగుతుంది.
గతంలో హరీశ్‌రావు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైద్యసిబ్బందితో నిత్యం సమీక్షలు నిర్వహించిన సందర్భాల్లో వారి బాగోగులు సైతం వాకబు చేసేవారు. జీతభత్యాల గురించి తెలుసుకునేవారు. ఒకవేళ సకాలంలో వేతనాలు రాలేదంటే కారణాలు తెలుసుకొని అప్పటికప్పుడు పరిష్కరించేవారు. ప్రస్తుతమున్న ఆరోగ్యశాఖ మంత్రి వీటన్నటికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా పెండింగ్ వేతనాల గురించి వైద్యసిబ్బంది అడగగా, సమీక్షకు హాజరైన వైద్యారోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్మింహ ఇన్ని నెలలనుంచి మీకు సిబ్బంది వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలియదని సమాధానం దాటవేశారు. సిబ్బంది వేతనాలపై అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో బస్తీ దవాఖానల్లో పని చేసే సిబ్బంది నిరాశకు గురయ్యారు. హైదారాబాద్ లాంటి ప్రాంతాల్లో ప్రతినెలా ఇంటి అద్దెలు, ఈఎంఐలు, నిత్యావసర సరుకులు కొనాలంటే వైద్య సిబ్బంది అప్పులు చేస్తున్నారు.