హైదరాబాద్ : తార్నాకలో టీఎస్ఆర్టీసీ(TS RTC) ఆస్పత్రి వైద్యుల సేవలు అభినందనీయమని ఆర్టీసీ ఎండీ(MD), వీసీ సజ్జనర్(Sajjanar) ప్రశంసించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా తార్నాక ఆసుపత్రి ఆవరణలో వైద్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సజ్జనర్ మాట్లాడారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మనిస్తారని వెల్లడించారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలు వైద్యులేనని అన్నారు .
కరోనా(Corona) కాలంలో వైద్యులు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. తార్నాక ఆసుపత్రిలో(Tarnaka Hospital) ప్రతిరోజు 1500 మంది అవుట్ పేషంట్లకు చికిత్స అందిస్తుండడం మాములు విషయం కాదన్నారు. ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థ ఆరోగ్యంగా భావించి గ్రాండ్ హెల్త్ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో 45 రోజుల్లో 45 వేల మంది సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేశారని అన్నారు. అనంతరం 55 మంది వైద్యులను ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) కృష్ణకాంత్, మెడికల్ ఓఎస్డీ సైదిరెడ్డి, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.