సైదాబాద్, డిసెంబర్ 11: ఆరేండ్లగా నత్త నడక నడిచిన సైదాబాద్ కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులు ఇప్పుడిప్పడే ఊపందుకున్నాయి. రూ. 4 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో చేపట్టిన భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. ప్రహరీగోడ నిర్మాణ పనులు, ఫర్నీచర్, క్యాబిన్ల ఏర్పాటులో కూలీలు బిజీ అయ్యారు. పాత పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్చివేసి, పక్కానే ఉన్న పోలీస్ క్వార్టర్లను కూడా కూల్చివేసి 2016లో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కొత్తగా భవన నిర్మాణ పనులు కొన్ని రోజులపాటు సవ్యంగా కొనసాగిన కొవిడ్‌తో స్తబ్ధతగా కొనసాగినా.. ప్రస్తుతం వేగం అందుకున్నాయి. దీంతో జనవరి 26వ తేదీన గణతంత్రదినోత్సవ జెండాను ఇక్కడే ఎగిరేసే విధంగా పనులను జోరందుకున్నాయి. అలాగే పోలీస్‌స్టేషన్‌తోపాటు అదే ఆవరణలో కొనసాగుతున్న మహిళా కౌన్సెలింగ్ సెంటర్ (భరోసా కేంద్రం) నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నూతనంగా నిర్మిస్తున్న సైదాబాద్ పోలీస్ స్టేషన్ పక్కనే భరోసా కేంద్రం ఉండటంతో మహిళల్లో ఆత్మైస్థెర్యం పెంచటానికి వారికి భరోసా కల్పించటానికి ఎంతో ఉపయోగ పడుతుంది. దీంతో భరోసా సెంటర్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాలు వంటి పనులను పూర్తిచేయటంతో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.
ఆరేండ్లుగా బ్యాంక్ కాలనీలోనే పోలీస్ స్టేషన్
సైదాబాద్ ఎస్బీహెచ్ – బీ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆరేండ్లుగా కొనసాగుతున్న పోలీస్‌స్టేసన్‌ను అక్కడి నుంచి ఖాళీ చేసి ఇక్కడికే రానుంది. కాలనీలో పోలీస్‌స్టేషన్ ఉండటంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులు నెల రోజుల్లోనే తొలగిపోయి వారికి విముక్తి లభించింది. బ్యాంక్ కాలనీలో దూరంగా ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్ వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను అనేకం ఉన్నాయి. పోలీస్‌స్టేషన్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని పలు మార్లు మలక్‌పేట ఎమ్మెల్యే బలాల అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా ఈ విషయాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తవించటంతో వాటి పనుల్లో కదలిక వచ్చింది. అధికారులపై ఎమ్మెల్యే వత్తిడి తీసుకుని రావటంతో పనులను త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా తగు చర్యలు తీసుకున్నారు. స్టేషన్ నిర్మాణ పనులు చివరి దశకు చేరటంతో వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ప్రారంభోత్సవానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
త్వరలోనే కొత్త స్టేషన్లోకి వస్తాం..
పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులు తుదిదశకు చేరటంతో త్వరలోనే ఇక్కడికి వస్తాం. ప్రహరీ నిర్మాణం, ఫర్నీచర్, క్యాబిన్ల ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల్లో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింటి వంటి పనులు సత్వరమే పూర్తి అవుతాయి. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్త పోలీస్‌స్టేషన్‌లోనే జరుపుకునే విధంగా సన్నాహాలు చేస్తున్నాం.
– సుబ్బరామిరెడ్డి , సైదాబాద్, ఇన్స్పెక్టర్