బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు చేసిన మోసానికి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఓ యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నాడు. మేడిపల్లిలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సాయి ఈశ్వర్ చారి (35) గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందారు. పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం ఆయన కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి తల్లి ప్రమీల, భార్యాపిల్లలతో జగద్గిరిగుట్టలో నివాసముంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స కోసం వచ్చిన సాయిఈశ్వర్.. శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారని ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు ప్రకటించారు. అనంతరం గాంధీ దవాఖానలోని మార్చురీలో మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. విషయం తెలియగానే బీసీ సంఘాల నాయకులు వస్తున్నారని సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య జగద్గిరిగుట్టలోని నివాసానికి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించారు. – సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట్/బేగంపేట, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గాంధీ దవాఖానలో చికిత్స పొందిన సాయిఈశ్వర్ చారిని పరామర్శించి.. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను ప్రభుత్వంపై పోరాడి సాధించుకుందామని, బీసీ బిడ్డలు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.
సాయిఈశ్వర్చారి మృతి చెందినట్లు తెలిసిన వెంటనే బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారితో పాటు వివిధ బీసీ సంఘాలకు చెందిన వందలాది మంది నేతలు, కార్యకర్తలు గాంధీ ఆసుపత్రికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గాంధీ దవాఖాన ప్రధాన ద్వారం మెట్లపై కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయి ఈశ్వర్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఎన్నికలకు ముందు కాంగెస్ పార్టీ ఇచ్చిన హామీ గురించి అడిగితే సర్కారు తమను ఎందుకు అరెస్టులు చేయిస్తున్నదని ప్రశ్నించారు. బీసీల ద్రోహీ అయిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ జాతి కళ్లు తెరవడానికి ఎంతో విలువైన తన ప్రాణాలు అర్పించిన బీసీ ఉద్యమంలో మొదటి అమరవీరుడు సాయిఈశ్వర్చారి అని అన్నారు. ఇకపై ఎవరూ బలిదానాలు చేయొద్దని కోరారు.
కాగా, సాయి ఈశ్వర్ మృతి చెందడంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా గాంధీ ఆసుపత్రి వద్ద బైఠాయించిన బీసీ నాయకులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా కొంతసేపు నగరంలో పలు పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఆ తర్వాత నాయకులు, కార్యకర్తలను తిరుమలగిరి, కార్ఖానా, రాంగోపాల్‌పేట, చిలకలగూడ, బొల్లారం, అంబర్‌పేట, ఉప్పల్ పోలీస్స్టేషన్లకు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బీసీ సంఘం నాయకులకు సంఘీభావం తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ మహిళా నేత సుమిత్ర తనోబా, బీసీ సంఘం నాయకులు గుజ్జు కృష్ణ, గణేశ్, హరిశంకర్, రాంగోపాల్‌పేట డివిజన్ బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీహరి తదితరులు ఉన్నారు.